కవర్ స్టోరీ..బ్రాండ్​ కల్తీ?

కవర్ స్టోరీ..బ్రాండ్​ కల్తీ?

ఇన్​స్టంట్​ మిక్స్, రెడీమేడ్​ ఫుడ్​, రెడీ టు ఈట్​, ఫార్ములా బేస్డ్​, ప్రాసెస్డ్​ ఫుడ్​.. వీటి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వాటి గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యవిషయం ఒకటుంది. అదేంటంటే వాటి క్వాలిటీ గురించి. క్షణాల్లో వండేసుకోవచ్చు, తినేయొచ్చు అని క్వాలిటీ లేని తిండి తినడం ఈజీనే. కాకపోతే వాటివల్ల దెబ్బతిన్న ఆరోగ్యాన్ని ఎంత ఖర్చు పెట్టినా అంత ఈజీగా తిరిగి కొనలేరు. అందుకే తినే వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకులే అని ఈజీగా పేపర్​ తిప్పేయకండి. ఒక్కసారి చదివి చూడండి ఫుడ్​ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుందో తెలుస్తుంది.

నెస్లే బ్రాండ్​ ప్రొడక్ట్స్​ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. పాలు తాగే పిల్లల  నుంచే ఆ బ్రాండ్​ ప్రొడక్ట్స్ వాడకం మొదలవుతుంది. అదంతా బాగానే ఉంది. కానీ, ప్రొడక్ట్​ తయారీలో నాణ్యత లేకపోతే అది ఎంత పెద్ద బ్రాండ్​ అయినా ఏం లాభం? అదే సమస్య వచ్చిపడింది ఇప్పుడు.  నెస్లే కంపెనీ ఇండియాకు పంపిస్తున్న సెరిలాక్​లో న్యూట్రిషన్స్​ తక్కువ, షుగర్స్ ఎక్కువగా ఉందట! మరి అలాంటప్పుడు దాన్ని పిల్లలకు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? పైగా అది వాడడం వల్ల ఆరోగ్యానికి చేటు. అయితే... ‘ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులు పంపిస్తుంది కదా! వాళ్లకు ఏం కాదా?’ అంటే.. ఆర్థికంగా వెనకబడిన పేద దేశాలు, ఇండియాలాంటి డెవలప్​ అవుతున్న దేశాలకు మాత్రం నాసిరకం ప్రొడక్ట్ అమ్ముతోంది! అమెరికా లాంటి అగ్రదేశాలకు వందశాతం నాణ్యత ఉన్న ప్రొడక్ట్స్​ వెళ్తున్నాయి. 

ఈ సంగతి ఎలా బయటపడింది అంటే... స్విట్జర్లాండ్​లోని ‘ది పబ్లిక్ ఐ’, ‘ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్​ యాక్షన్ నెట్​వర్క్ (ఐబిఎఫ్​ఎఎన్​)’తో కలిసి బెల్జియంలోని లాబొరేటరీలో సెరల్ ప్రొడక్ట్స్​ని టెస్ట్ చేశాయి. స్విట్జర్లాండ్​లోని సంస్థలు బెల్జియం వెళ్లి ఎందుకు టెస్ట్​ చేయాల్సి వచ్చిందంటే... అక్కడి లాబొరేటరీలు టెస్ట్​ చేయడానికి అంగీకరించలేదు కాబట్టి. ఆ టెస్ట్​ల్లో భాగంగా ఇండియాలో దొరికే15 సెరిలాక్ ప్రొడక్ట్స్​ టెస్ట్ చేస్తే, వాటిలో ఒక్కోదాంట్లో 2.7 గ్రాములకు పైగా అదనపు చక్కెర ఉన్నట్టు తేలింది. 

తమ ప్రొడక్ట్​ గురించి ఎందుకు వాడాలో చెప్పేటప్పుడు న్యూట్రియెంట్స్​ని హైలైట్ చేసినట్టు ఈ షుగర్స్​ గురించి చెప్పట్లేదు. ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాలకు వెళ్లే ప్రొడక్ట్స్​లో డబ్ల్యూహెచ్​ఒ గైడ్​లైన్స్ పాటించట్లేదు. జర్మనీ, యూకే వంటి దేశాల్లో ఆరునెలల పసివాళ్లకు ఇచ్చే నెస్లే ప్రొడక్ట్​లో షుగర్స్ లేవు. ఇతియోపియాలో అదే ప్రొడక్ట్​లో ఐదు గ్రాములకు మించిన షుగర్​ ఉంది. 

అదే థాయిలాండ్​లో అయితే ఆరు  గ్రాములు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ‘పబ్లిక్ ఐ’ పబ్లిష్ చేసింది. దాంతో ఆ కంపెనీ ఈ మధ్యే తమ తప్పు ఒప్పుకుని మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తపడతామని సమాధానం చెప్పింది. దీనికంటే ముందు పిల్లలు ఇష్టంగా తినే మ్యాగీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కంపెనీ ఈ మధ్యనే ఆ కేసు నుంచి బయటపడింది. అంతలోనే మరో ప్రొడక్ట్​ వల్ల వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ ఒక్కటే కాదు ఈ కోవలోకే వస్తుంది జాన్సన్​ అండ్​ జాన్సన్​ కంపెనీ.

*   *   *

పేరుకే బ్రాండెడ్​

జాన్సన్​ అండ్ జాన్సన్.. వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్​. కానీ, ఇప్పుడు ఆ బ్రాండ్​ ప్రొడక్ట్స్ మాత్రం కొనొద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్​లో నాణ్యత లోపించింది. బేబీ ప్రొడక్ట్స్ నుంచి మెడిసిన్స్ వరకు అన్నిరకాల బ్యూటీ, హెల్త్ ప్రొడక్ట్స్ తయారుచేసే ఇలాంటి కంపెనీ కూడా నాసిరకమైన ప్రొడక్ట్స్​ తయారుచేస్తోంది. గతంలో జాన్సన్​ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన దగ్గు మందు వాడడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అప్పుడు ఈ కంపెనీ చేస్తున్న వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. ఈ కంపెనీ తయారుచేసే బేబీ పౌడర్స్ వల్ల పిల్లలకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

*   *   *

అసలు ప్రాబ్లమ్ ఇదే!

ఈ మధ్య 36 ప్రొటీన్ పౌడర్లను టెస్ట్ చేస్తే వాటిలో 70 శాతం ప్రొటీన్ గురించిన సమాచారం ఆందోళన కలిగించేదిగా ఉంది.14 శాతం ప్లాంట్ బేస్డ్​ ప్రొటీన్ శాంపిల్స్​లో హానికర ఫంగల్ అఫ్లటాక్సిన్స్ అనేవి ఉన్నాయి. 8 శాతం శాంపిల్స్​లో పెస్టిసైడ్​ గుర్తులు కనిపించాయి. హెవీ మెటల్ ఎనాలసిస్​లో మెర్క్యురి లేదా థాలియం లేదా ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్,  కాపర్ వంటివి ఉన్నట్టు తేలింది. ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్స్ హై ప్రొటీన్ ఉండే సోయాబీన్స్, బటానీలు, రైస్, పొటాటోలు, ఎగ్స్, పాల వంటి వాటినుంచి తయారుచేస్తారు. అందులో షుగర్స్, ఆర్టిఫిషియల్  ఫ్లేవర్స్, థిక్​నర్స్ కలుపుతారు. 

ప్రొటీన్ సప్లిమెంట్స్

ఈ మధ్య చాలామంది సహజం​గా​ అందే పోషకాహారాన్ని వదిలిపెట్టి ఆర్టిఫిషియల్ ​గా తయారయ్యే ప్రొటీన్ పౌడర్లు, సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నారు. నిజానికి ఈ ప్రొటీన్ సప్లిమెంట్​లు గుడ్లు, పాలు, పాలను విరగ్గొట్టిన నీళ్లు లేదా సోయా, బటానీలు లేదా బియ్యం వంటి పదార్థాలతో తయారుచేస్తారు. వీటిలో అదనంగా షుగర్స్ కలుపుతారు. అందువల్ల ఇవి తీసుకుంటే కిడ్నీ, ఎముకలు ఎఫెక్ట్ అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. పప్పుధాన్యాలు, గింజలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి వాటి నుంచి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. అలాగే ఏ రకమైన ప్రొటీన్​ పౌడర్​ లేదా సప్లిమెంట్​ ఇవ్వాలన్నా ఒక వ్యక్తికి ఎంత ప్రొటీన్ అవసరం అనే అంచనా ఉండాలి. నాణ్యమైన ప్రొటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్​ అందిస్తాయి. ఎంత ప్రొటీన్ తీసుకుంటే దానికి తగ్గట్టు శారీరక శ్రమ కూడా చేయాలి కూడా. 

వే ప్రొటీన్ అంటే.. 

విరిగిన పాల నుంచి హై క్వాలిటీ ప్రొటీన్ తయారుచేస్తారు. దాన్నే ‘వే ప్రొటీన్ పౌడర్’ పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఇందులో కావాల్సిన అమైనో యాసిడ్స్​ ఉంటాయి. వాటిని బాడీ తయారు చేసుకోలేదు. అథ్లెట్స్, బాడీ బిల్డర్స్, ఫిట్​నెస్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తాగుతారు. ఎందుకంటే వీటిని శరీరం వేగంగా శోషించుకుంటుంది. కండరాలు త్వరగా పెరగడానికి, రికవర్ అవ్వడానికి సాయపడతాయి. ప్రొటీన్ కంటెంట్ అనేది ఆయా బ్రాండ్స్​, వాటి మాన్యుఫాక్చరింగ్​ చేసే పద్ధతిని బట్టి మారుతుంటుంది. నిజానికి నాణ్యమైన ప్రొటీన్ పౌడర్ వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా సాయపడతుంది. టిష్యూ రిపేర్​కి, గర్భిణులు, బాలింతలకు సాయం చేస్తుంది. కాకపోతే ఉబ్బరం, తల తిరగడం, గ్యాస్ట్రిక్​ సమస్యలు వస్తాయి. లివర్, కిడ్నీ జబ్బు​లు ఉన్నవాళ్లు వీటిని వాడొద్దని హెచ్చరిస్తున్నారు న్యూట్రిషనిస్ట్​లు.

డబ్ల్యూహెచ్​ఒ హెచ్చరిక

ఇండియాలో 2022 నాటికి 70 మిలియన్ల పెద్దవాళ్లు ఒబెసిటీతో బాధపడుతున్నారు. అందులో మగవాళ్లకంటే ఆడవాళ్ల సంఖ్య రెండింతలు. ఈ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఒ చేసిన స్టడీలో11 శాతం డయాబెటిక్, 35.5 శాతం హైపర్ టెన్షన్​తో బాధపడుతున్నట్టు తేలింది. మామూలు ఒబెసిటీ 28.6, అబ్డామినల్ ఒబెసిటీ 39.5 పర్సెంట్​ ఉన్నట్టు గతేడాది జూన్​లో ‘ది లాన్సెట్ జర్నల్​’లో పబ్లిష్​ అయింది. ఇదిలాగే ఉంటే తక్కువ, ఓ మాదిరి ఆదాయం ఉన్న దేశాల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. కార్డియోవాస్కులార్ జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి పెరుగుతాయి. ఎక్కువ మోతాదులో చక్కెర ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్​ తింటే ఒబెసిటీకి కారణమవుతుంది అని డబ్ల్యూహెచ్​ఒ హెచ్చరిస్తోంది. 

డాక్టర్లు ఏం చెప్తున్నారు?

ఈ మధ్య రెడీమేడ్​గా దొరికే ప్రొటీన్ సప్లిమెంట్స్ గురించి ఐసీఎంఆర్ కొన్ని గైడ్​లైన్స్ ఇచ్చింది. ఇండియాలో ఒబెసిటీ, డయాబెటిస్, న్యూట్రిషన్ లోపం వంటి కేసులు ఎక్కువగా చూస్తున్నాం అన్నారు  న్యూట్రిషనిస్ట్​ డాక్టర్ సుజాత స్టీఫెన్. ‘‘ ప్రొటీన్ సప్లిమెంట్స్ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. చాలామంది వాటికి అలవాటు పడుతున్నారు. షుగర్, సిరప్​లతో తయారైన ప్రొడక్ట్స్ వాడడం ఎక్కువైపోయింది. నిజానికి రోజుకి ఎంత ప్రొటీన్​ శరీరానికి అవసరం అనేదానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. ప్రొటీన్స్​ని అమైనో యాసిడ్స్ సమ్మేళనం అని కూడా అంటాం. 

వాటిలో పనికొచ్చేవి, పనికిరానివని రెండు రకాలు ఉంటాయి. పనికొచ్చే అమైనో యాసిడ్స్ శరీరానికి అందితే సరిపోతుంది. అవి ఎంతకావాలనేది శరీర బరువును బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున తీసుకోవాలి. అయితే రోజూ మనం తినే ఫుడ్​లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తక్కువగా లభిస్తాయి. అందుకని చాలామంది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కోసం సప్లిమెంట్స్ వాడుతున్నారు. వాటిలో అయితే పనికిరానివేవీ ఉండవు. కాబట్టి వాటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ.. వెజిటేరియన్స్​ ఎక్కువగా ఈ ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. 

ఇంకొందరేమో కండలు పెంచడానికి, యాక్టివ్​గా పనిచేసుకోవడానికి ప్రొటీన్ అవసరమని వీటిని అలవాటు చేసుకుంటున్నారు. అవసరమైతే డాక్టర్లు కూడా వాటిని వాడమని చెప్తారు. అదెలాంటి సందర్భంలో అంటే.. బలహీనంగా ఉండి, ఫుడ్ అరిగించుకునే శక్తి లేనివాళ్లకు ఇవి ఇస్తారు. ఈ ప్రొడక్ట్స్​ మార్కెట్లో దొరికేవి కాదు. క్లినికల్​గా ప్రూవ్​ అయిన ప్రొడక్ట్స్ అంటున్నారు డాక్టర్లు. 

నాన్​వెజ్​ వద్దని...

ప్రొటీన్ కోసం నాన్​వెజ్ తినాలా? ప్రొటీన్ డ్రింక్స్ తాగితే సరిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది. పైగా తక్కువ ఖరీదు ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీగా కొని వాడుతున్నారు. కానీ, ఇలా ప్రాసెస్డ్ ప్రొటీన్ వాడడం వల్ల అజీర్ణం, నీరసం, జీవక్రియలు సరిగా జరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్ పౌడర్లలో ఆర్టిఫిషియల్  స్వీట్​నర్స్, స్టిరాయిడ్​ బేస్డ్, పెస్టిసైడ్స్ వంటివి ఉంటాయి. జిమ్​లో వర్కవుట్స్ చేసేవాళ్లు ఎనర్జీ వెంటనే లాస్​ అవ్వకుండా ఉండేందుకు ‘వే’ ప్రొటీన్ పౌడర్స్ వాడుతున్నారు. అవి చాలా ఖరీదు ఉంటాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. మన దగ్గర కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రొటీన్ పౌడర్లు తయారుచేస్తున్నారు. కానీ, వాటి నాణ్యత ఎలా ఉందనేది ప్రశ్నార్థకం. ఏ ప్రొడక్ట్​కి అయినా క్వాలిటీ చెక్ లేనప్పుడే సమస్యలు వస్తాయి.

ఏదైనా శృతి మించకూడదు

కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రొటీన్​ అనేది చాలా సంక్లిష్టమైన పదార్ధం. అందుకని ఇది జీర్ణం అయ్యేందుకు టైం పడుతుంది. ప్రొటీన్ ఏ రూపంలో తీసుకున్నారనే దాన్నిబట్టి అరుగుదల ఉంటుంది. జిమ్​కి వెళ్లే వాళ్లు ఫాస్ట్​గా అరుగుతుందని ‘వే’ ప్రొటీన్ తీసుకుంటుంటారు. వీటిలో బ్లాక్ చెయిన్ అమైనో యాసిడ్స్ (బీసీఎ) ఎక్కువగా వాడతారు. దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. కండలు పెంచడానికి, ఎక్సర్​సైజ్ బాగా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే, ఎక్కువకాలం ప్రొటీన్ పౌడర్లను వాడడం వల్ల కొంతకాలానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ఎంత డోస్ తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? అనేది చూసుకోవాలి. ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఫుడ్ సరిగా తీసుకోలేనప్పుడు సప్లిమెంట్స్ అనేది ఒక ఆప్షన్. అలా లేననప్పుడు ఫుడ్​ ద్వారా అవసరమైన పోషకాలను తీసుకోవడం మంచిది. రాజ్మా, శెనగ, బటానీ, గుడ్డు, మాంసాహారం వంటివి ఎక్కువగా తినాలి. అనారోగ్యంలో ఉండి, ఏదైనా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ రికవరీ స్టేజ్​లో ఉన్నప్పుడు, పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు కండరాలు బాగా పెరిగేలా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. 


మోతాదుకు మించి సప్లిమెంట్స్ తీసుకుంటే కిడ్నీ, లివర్ వంటి అవయవాల మీద ప్రభావం పడుతుంది. దానివల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. శరీరానికి తనంతట తాను అమైనో యాసిడ్స్​ని శోషించుకునే  గుణం ఉంటుంది. అలాంటిది దానికి డైరెక్ట్​గా అందిస్తే... వాటిని ఎలా ఉపయోగించాలి? అని అయోమయంలోకి నెట్టినట్టే. దాంతో వేస్ట్ మెటీరియల్​ని కిడ్నీలకు పంపిస్తుంది. కిడ్నీల మీద లోడ్ ఎక్కువ అయ్యి స్టోన్స్ ఏర్పడతాయి. అంతేకాదు దీనివల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. 
మినిమమ్​ డోసేజ్​ అయితే శరీరం అరిగించుకుంటుంది. 

కానీ అదే పనిగా ఎక్కువ డోసేజ్​లో రెగ్యులర్​ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఓవర్ లోడ్ అవుతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. జీవక్రియలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివ్​గా అవుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఓవర్​డోస్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ వంటి హెల్త్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. కొంతమందికి ప్రొటీన్ అలెర్జీ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ల బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. దాంతో వంటి మీద దురద, వాపు వంటివి వస్తాయి. ఇలా దీర్ఘకాలంగా దాని ప్రభావం ఉంటుంది. గుండెసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. హెవీ ఎక్సర్​సైజ్​లు చేసే బీపీ పేషెంట్లకు హార్ట్ ఎటాక్స్​ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో బాడీ బిల్డింగ్​ చేయాలనుకుంటే మంచి ప్రొటీన్స్ తీసుకోవాలి. 

సప్లిమెంట్స్ తీసుకోవాలంటే..

ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒబెసిటీ, డయాబెటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి ప్రొటీన్ ప్రొడక్ట్స్. అనారోగ్యం నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్న వాళ్లు ఫుడ్ ద్వారా తీసుకోలేరు. అందుకని ట్రీట్​మెంట్​లో భాగంగా సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాం. అది ఒకే రూపంలో కాకుండా ఎగ్, నాన్​వెజ్, పప్పులు వంటి వాటి ద్వారా తీసుకోవచ్చు. అది కూడా డైట్​ తీసుకుంటూనే సప్లిమెంట్ తీసుకోవాలి. అలాంటి వాటినే డాక్టర్​లు రికమెండ్ చేస్తారు. మార్కెట్​లో దొరుకుతున్నాయి కదా అని ఏదంటే అది వాడకూడదు. మార్కెట్​లో దొరికేవాటిలో ప్రొటీన్ తక్కువ, మిగతావి ఎక్కువ ఉంటున్నాయి. స్టార్చ్ లేదా మిల్క్​ పౌడర్ బేస్డ్​గా ప్రొటీన్ పౌడర్ తయారుచేస్తారు.  

వాటిలో ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటివల్ల డయాబెటిస్ రిస్క్ ఉంటుంది. ఎక్కువకాలం ఇవి వాడితే జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని ఐసీఎంఆర్​ చెప్పింది. ఇండియన్ డైటరీ ప్రొడక్ట్స్​లో షుగర్స్ ఉంటున్నాయి. 


నాన్​వెజ్ తినని వాళ్లలో బి –12 లోపం అనేది సహజంగానే ఉంటుంది. ఇండియన్స్​కి ప్రొడక్ట్​ మీద ఉన్న లేబుల్​ చదివే అలవాటు తక్కువ. ఒకసారి ప్రొడక్ట్​ వెనక ఏం రాసుందో చూస్తే ఆయా పదార్ధాల్లో ఏం వాడారో తెలుస్తుంది. ఆ అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువగా వాడుతున్నారు. అయితే, ఇండియాలో పౌష్టికాహారలోపంతో తక్కువ బరువుతో పుట్టే పిల్లలు ఉన్నారు. ఊబకాయంతో పుట్టేవాళ్లూ ఉన్నారు. ఇలా కాకుండా బ్యాలెన్స్ కావాలంటే కావాల్సింది తినే తిండి మీద అవగాహన.  ఏం తింటే ప్రొటీన్లు వస్తాయి అనేది తెలుసుకోవాలి. అలాగే సహజంగా శరీరానికి అందేవి ఎప్పుడూ బెస్ట్​” అన్నారు డాక్టర్ సుజాత.

లేబుల్ చూసి కొనాలి

ప్రాసెస్డ్​ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్​ కొనేముందు లేబుల్​ మీద ఉన్న సమాచారం చదివి ఆ తరువాతే కొనాలి. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్​ సరైనదేనా అనేది గమనించాలి. లేబుల్ మీద 20–30 గ్రాముల ప్రొటీన్​ అని ఉంటే కచ్చితంగా అంత ప్రొటీన్ ఉండాలి. అన్ని రకాల ఎసెన్షియల్ యాసిడ్స్ ఉన్న కంప్లీట్ ప్రొటీన్లు బెస్ట్ ఛాయిస్. అయితే అన్నిరకాల ప్రొటీన్లు అందరికీ పడవు. కాబట్టి ఏ ప్రొటీన్లు సరిపడతాయో వాటినే తీసుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్​లో 30 గ్రాముల ప్రొటీన్​ ఉందని రాస్తారు. కానీ  20 గ్రాములే ఉంటుంది. మన దగ్గర నేషనల్ శానిటేషన్ ఫౌండేషన్ (ఎన్​.ఎస్​.ఎఫ్​.), యూఎస్​లో ఫార్మాకొపియ వంటి సంస్థలు స్వచ్ఛందంగా ఈ టెస్ట్​లు చేస్తాయి. ఆ ఆర్గనైజేషన్స్ ద్వారా సర్టిఫై చేసిన ప్రొడక్ట్స్​ అయితే వాడేందుకు ఓకే. ఎందుకంటే ఆయా కంపెనీలు చెప్పిన పదార్థాలను సదరు ప్రొడక్ట్స్​లో వాడారని ఆ ఆర్గనైజేషన్స్​ తేలుస్తాయి కాబట్టి. అందుకే ఇవి నాన్ సర్టిఫైడ్​, నాన్ అటెస్టెడ్​ వెరైటీల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి. మరి ఆరోగ్యంతో పోలిస్తే ఆ ఖరీదు చాలా తక్కువే కదా! 


కొన్ని ప్రొటీన్​ పౌడర్లలో హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్, హానికర అడెటివ్స్ ఉంటున్నాయి. అవి చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. శరీరంలో అవయవాలు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత, అలర్జిక్ రియాక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి కల్తీ ప్రొడక్ట్స్​వాడకపోవడం అనేది మన ఆరోగ్యం కోసం మనం ఇచ్చుకునే కాంప్లిమెంట్!​ ‘ఓకే’ అని సర్టిఫై చేసిన  ప్రొడక్ట్స్ మాత్రమే ఎంచుకోవాలి. ఎన్​.ఎస్​.ఎఫ్.​ హానికర పదార్థాలను టెస్ట్ చేయడమే కాదు అవసరమైతే బ్యాన్ కూడా చేస్తుంది. 


ప్రొటీన్ పౌడర్ల ఇంగ్రెడియెంట్స్ లిస్ట్​లో ప్రొడక్ట్ క్వాలిటీ గురించి బోలెడంత సమాచారం ఉంటుంది. హై క్వాలిటీ ప్రొటీన్ పౌడర్లలో ఇంగ్రెడియెంట్స్ లిస్ట్ చిన్నగా ఉంటుంది. ప్రొటీన్ సోర్స్ ఎంత ఉందో హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అడిటివ్స్ గురించి పెద్ద లిస్ట్ ఉండదు. అందుకే కొనేటప్పుడు అదనపు షుగర్, ఆర్టిఫిషియల్  స్వీట్​నర్లు లేదా ఎక్సెసివ్ ఫిల్లర్స్ వంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. అవి ఉంటే కనుక ప్రొటీన్ కంటెంట్​ను డైల్యూట్ చేస్తాయి. దాంతో ప్రొడక్ట్​లోని న్యూట్రిషినల్ వాల్యూ తగ్గిపోతుంది. 

ఎలా గుర్తించాలి

    నకిలీ ఉత్పత్తులు చాలా వరకు బాగా తెలిసిన బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపీ చేస్తాయి. పేరులో చిన్న చిన్న మార్పులు చేస్తాయి. అటువంటి వాటిని 
గుర్తించాలి. 
    ప్రొటీన్ సప్లిమెంట్లను కొనేటప్పుడు ప్రతిసారీ ప్యాకేజింగ్ డిజైన్, లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంది గమనించాలి.
    కొన్ని నకిలీ ఉత్పత్తుల్లో తయారీ తేదీ తప్పుగా ఉంటుంది. అదేకాకుండా ప్రొడక్ట్ కోడ్​, హోలోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.
    పెద్ద బ్రాండ్ల డబ్బాల్లో నకిలీ ఉత్పత్తులు రీఫిల్ చేసి కూడా అమ్ముతుంటారు. అటువంటి పరిస్థితిలో ప్రొడక్ట్​ కోడ్​లో ట్యాంపరింగ్ జరిగితే దాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు.
    నకిలీ ప్రొటీన్ సప్లిమెంట్లను రుచికరంగా చేసేందుకు, చక్కెరను విడిగా కలుపుతారు. అటువంటి పరిస్థితిలో వాటి రుచి నిజమైన ప్రొటీన్ సప్లిమెంట్ల కంటే తియ్యగా ఉంటుంది.
    నకిలీ ప్రొటీన్ పౌడర్లలో సువాసనను పెంచే సమ్మేళనాలు కూడా కలుపుతారు. అందుకని ప్రొటీన్ సప్లిమెంట్ వెరైటీ వాసన వస్తే జాగ్రత్త పడాల్సిందే. 
     సప్లిమెంట్స్​ వాడాలి అనుకుంటే హెల్త్ ఎక్స్​పర్ట్స్ సలహా తీసుకోవాలి. వాళ్లు సిఫార్సు చేసిన  సప్లిమెంట్లను మాత్రమే వాడాలి.
నకిలీ ప్రొడక్ట్స్​ అమ్మే వాళ్లు భారీ డిస్కౌంట్లు లేదా ప్రకటనలు ఇస్తారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ప్రొటీన్ సప్లిమెంట్ల ద్వారా కండరాలు పెరగడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అందుకని అలాంటి ప్రకటనలు మీ కంట పడితే వాటిని పట్టించుకోవద్దు. 
ప్రస్తుతం చాలా నకిలీ ప్రొటీన్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా అమ్ముతున్నారు. సో బీ అవేర్​ అండ్​ బీ కేర్​ఫుల్​.

*   *   *

టాల్కం పౌడర్లు కూడా

వంట్లోకి పంపే పౌడర్లే కాదు ఒంటికి రాసుకునే పౌడర్లతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన ‘జాన్సన్ అండ్ జాన్సన్​​’ బేబీ టాల్కం పౌడర్​ ప్రొడక్ట్​ని పర్మినెంట్​గా ఆపేస్తున్నట్టు 2020లో ప్రకటించింది. అందుకు కారణం కంపెనీ మీద వేలల్లో ఆరోపణలు రావడమే. ఆ ప్రొడక్ట్ వల్ల క్యాన్సర్లు వస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 

అందుకే ఒంటికి పూసుకునే పౌడర్ల విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. టాల్కమ్​ బేస్డ్ బేబీ పౌడర్స్​లో మినరల్ టాల్క్​  ఉంటుంది. అందులో మెగ్నీషియం, సిలికాన్, ఆక్సిజన్​ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి తేమను పీల్చుకుని, చర్మం​ మీద రాపిడిని తగ్గిస్తాయి. కాబట్టి ఈ పౌడర్లు ఒంటి మీద వేసుకుంటే ర్యాషెస్, డైపర్ రాషెస్​ రావు. కానీ, ఈ మధ్య మార్కెట్​లోకి వచ్చే పౌడర్లలో టాల్క్​ ఉండట్లేదు. టాల్క్ - ఫ్రీ పౌడర్లలో కార్న్​ స్టార్చ్​, ఇతర సహజ ఇంగ్రెడియెంట్స్ వంటివి వాడుతున్నారు.

పిల్లలకు పౌడర్లు అక్కర్లేదు

అసలు పిల్లలకు బేబీ పౌడర్ అవసరమే లేదు అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఎఎపి) చెప్పింది. అంతేకాదు లోషన్స్, ఆయిల్స్ కూడా అవసరం లేదు. పసిపిల్లల చర్మం సున్నితం​గా ఉంటుంది. కొన్నిసార్లు ఈ పౌడర్లు పిల్లల చర్మాన్ని ఇరిటేట్ చేసే అవకాశం ఉంది. అదొక్కటే కాకుండా ఆ పౌడర్ల వాసన ఎక్కువగా పీలిస్తే కూడా పిల్లలకు హాని చేస్తాయి. ప్రయివేట్ పార్ట్స్​లో టాల్కమ్​ పౌడర్లు వాడటం వల్ల ఆడవాళ్లలో ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఎక్కువ.1970 నుంచి టాల్కమ్​ పౌడర్లు ఆస్బెస్టాస్ - ఫ్రీగా తయారుచేస్తున్నారు. 

అయినప్పటికీ టాల్కమ్​ పౌడర్​కి, క్యాన్సర్​కి ఉన్న సంబంధం ఏంటనేది ఇంకా తేలలేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి. ‘టాల్కం పౌడర్లను పిల్లలకు వాడొద్దు. లంగ్స్ మీద ఎఫెక్ట్ పడితే టాల్క్ న్యుమోకొనియోసిస్ అనే జబ్బు వస్తుంది. దానివల్ల పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకని దానికి బదులు నూనెతో తయారైన లోషన్స్, ఆయింట్​మెంట్స్, క్రీమ్​లు పూయాలి. బేకింగ్ సోడా, కార్న్​ స్టార్చ్ పౌడర్లు, పెట్రోలియం జెల్లీ, జింక్ ఆక్సైడ్​తో తయారైన డైపర్ ర్యాష్ క్రీమ్​, టాపియోక స్టార్చ్ వంటివి వాడొచ్చు’ అని 2018లో   ఎ.ఎ.పి. చెప్పింది. 

‘‘కార్న్​ స్టార్చ్ బేస్డ్ పౌడర్లు కూడా అప్పుడప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే వాటిలో వాడే ఇంగ్రెడియెంట్స్ వల్ల డైపర్​ రాష్​కు కారణం అవుతుంది. ముఖానికి పూయడం వల్ల ఆ వాసన పిల్లలు పీల్చడంతో లంగ్స్​ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పిల్లలకు హాని చేసే వీటిని వాడొద్దు’’ అన్నారు  డాక్టర్ జోయెల్. ఈయన న్యూయార్క్​లోని స్యోసెట్ హాస్పిటల్​లో పీడియాట్రిక్స్ డైరెక్టర్. అలాగే, డైపర్ ర్యాష్ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు డైపర్ మారుస్తుండాలి. అలా మార్చేటప్పుడు కొత్త డైపర్​ వేసే ముందు రెండు నిమిషాలు గాలి ఆడేలా పిల్లల్ని ఉంచాలి. ఒకవేళ ర్యాషెస్ వచ్చి చర్మం పొడి బారితే పెట్రోలియం లేదా జింక్ ఆక్సైడ్ బేస్డ్ క్రీమ్స్​ పూయాలి. 

బేబీ ఫుడ్​

ఇది ఫార్ములా బేస్డ్​ పౌడర్. పిల్లలకు ఎప్పుడైనా వాళ్లు అరిగించుకునేది, ఇంట్లో చేసిందే పెట్టాలి. అలా పెడితేనే పిల్లలకు షుగర్స్ తగిన మోతాదులో అందుతాయి. పిల్లలకు సెరిలాక్ వంటి రెడీమేడ్​ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్లు స్వీట్​ టూత్​కి అలవాటుపడతారు. దాంతో తీపి తినడానికి ఇష్టపడతారు. స్వీట్లు అతిగా తింటే చిన్న వయసులోనే ఒబెసిటీ వస్తుంది. అందుకని నేచురల్​ పదార్థాలను పెట్టడం బెటర్​. బేబీ ఫుడ్స్​లో రసాయనాలు ఉండకపోవచ్చు. తయారీదారులు వాళ్ల రూల్స్​కు అనుగుణంగా తయారుచేస్తారు. కానీ ప్రతి శిశువు ఒకేలా ఉండరు. 

అందుకనే అటువంటి ప్రొడక్ట్స్​ని ఎమర్జెన్సీగా వాడాలి. అంతేతప్ప వాటిపైనే ఆధారపడకూడదు. తల్లి దగ్గరలేదు, పాలు పట్టించే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఇవి పట్టాలి. సంపాదన ఉన్నవాళ్లు, చదువుకున్న వాళ్లు చాలామంది ఈజీగా పని అయిపోతుంది అని సెరిలాక్​ వంటివి పెడుతున్నారు. వాటి వాడకం తగ్గిస్తే బెటర్. అలాగే వాళ్లకు ఒకేలాంటి ఆహారం కాకుండా ఇంట్లోనే రకరకాలుగా తయారుచేసి పెట్టొచ్చు. 

ఆర్గానిక్, నో పెస్టిసైడ్, నో ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్​ మార్కెట్​లో దొరుకుతున్నాయి. అడ్వర్టైజ్​మెంట్స్​లో చూపించారని వాటికి అట్రాక్ట్​ అయిపోయి వెంటనే వాటిని కొనొద్దు. ఒకటికి రెండుసార్లు వాటి గురించి తెలుసుకుని, మంచివా కావా అనేది చూసి కొనాలి. ఇలాంటి ప్రొడక్ట్స్​ ఓవర్​ ది కౌంటర్ (ఓటీసీ) దొరుకుతున్నాయి. అలాగని మెడికల్​ షాపులో ఉన్నాయి కదా అని అవి మెడిసినల్ ప్రొడక్ట్స్, హెల్దీ అనుకోవడానికి లేదు. అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నాం... ఆ ప్రొడక్ట్​ తయారీలో ఏమేం వాడారనేది చూసి, వాటి గురించి తెలుసుకున్నాకే మంచివనుకుంటే కొనుక్కోవాలి. 

డా. సుజాత స్టీఫెన్
చీఫ్​ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

తల్లిపాలే బెస్ట్​

మొదటి ఆరు నెలలు తల్లిపాలు ముఖ్యం. ఆ తర్వాత వీనింగ్ పీరియడ్​లో అంటే... తల్లి పాల నుంచి ఘనాహారం అలవాటు చేసే క్రమం. ఆరు నెలల తరువాత ఏడో నెలలో బ్రెస్ట్ మిల్క్ ఒక్కటే సరిపోదు. అప్పుడు ఇంట్లో తయారుచేసిన ఆహారం పిల్లలకు పెట్టాలి. అది కూడా ఏ నెలలో ఏ ఫుడ్ పెడితే బెటర్ అనే చార్ట్​ ఒకటి​ ఇస్తాం. పసిపిల్లలకు ఇప్పుడు ఇచ్చే రెడీమేడ్​ ప్రొడక్ట్స్​లో షుగర్​ ఉండడం వల్ల చాలావరకు తియ్యగా ఉంటాయి. దాంతో తీపి రుచికి వాళ్లు అలవాటుపడతారు. ఆ తర్వాత వేరే ఫుడ్ పెడితే సరిగా తినరు.

అప్పుడు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని అలాంటి రెడీమేడ్​ ఫుడ్​ పెట్టమని మేం రికమండ్ చేయం. ఆప్షన్ లేనప్పుడు అవి పెట్టక తప్పదు. కానీ పండ్లు, కాయగూరల నుంచి అందే సహజ పోషకాలు మంచిది. రెండేండ్ల వరకు పిల్లలకు ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్లకు జీర్ణం చేసుకునే కెపాసిటీ ఉండదు. వాటిలో విటమిన్స్ ఉండొచ్చు. కానీ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్​లో దొరికే ప్రొడక్ట్స్​లో పిల్లల వయసుకి మించి షుగర్స్​ ఉంటున్నాయి. వాటితోపాటు ఆర్టిఫిషియల్  కలర్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. 

ప్యాకెట్ వెనక ఉన్న కాంపోజిషన్ చదివితే తెలుస్తుంది. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబెసిటీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఎక్కువగా తింటే పళ్లకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలకు తల్లి పాలను మించింది లేదు. మొదటి మూడు రోజులు వచ్చే కొలోస్ట్రమ్ కూడా చాలా మంచిది. ఎంత ట్రై చేసినా పాలు రాకపోయినా, డీహైడ్రేట్​ అయినా, షుగర్స్ తగ్గిపోయినా, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు ఫార్ములా మిల్క్ ఇస్తారు. కానీ ఇలా ఎప్పుడో కానీ సజెస్ట్ చేయం. అప్పుడు కూడా ఫార్ములా మిల్క్ వాడమంటామే కానీ ఫలానా బ్రాండ్​ వాడమని చెప్పం.

 
ఎప్పుడూ కూడా బ్రాండ్స్, అడ్వర్టైజ్​మెంట్స్ చూసి కొనొద్దు. ప్రొడక్ట్ వెనక ఇచ్చిన ఇంగ్రెడియెంట్స్ చూడాలి. ఫ్లేవర్ లేకుండా నార్మల్ న్యూట్రిషన్​కి పిల్లల్ని అలవాటు చేయాలి. డ్రై ఫ్రూట్ పౌడర్స్, కర్జూరాలు, పెరుగు వంటివి కలిపి పెట్టొచ్చు. రెండేండ్ల తర్వాత తల్లి పాలు లేదా పాలు తాగాలన్న రూల్ అయితే లేదు. ఫ్రూట్స్, గింజధాన్యాలు, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తినాలి. పాలు ఇవ్వాలంటే చక్కెర లేకుండా మిల్క్​ షేక్ ఇవ్వొచ్చు. దానికంటే నేరుగా పండ్లు తినడం ఇంకా బెటర్. ఆటలు ఆడి, అలసిపోతుంటే డీహైడ్రేట్​ కాకుండా ఉండేందుకు నీళ్లు, కొబ్బరి నీళ్లు, బాదం మిల్క్, ఓఆర్​ఎస్​ వంటివి ట్రై చేయాలి. 
ఎప్పటికైనా నేచురల్​ ఫుడ్స్ బెస్ట్. 

పసివాళ్లకు ఎలాంటివి తినడం అలవాటు చేస్తున్నారో గమనించుకోవాలి. ఎందుకంటే మొదట ఏది అలవాటు చేస్తే తరువాత దానికే వాళ్లు అలవాటుపడతారు. పిల్లలు బరువు, ఎత్తు సరిగా లేదు అన్నప్పుడు పీడియాట్రిషన్​ని కలవాలి. వయసుకి తగ్గట్టు ఉన్నారా? లేదా? అనేది వాళ్లు గమనిస్తారు. తేడా ఏమైనా ఉంటే డైట్ ఎలా తీసుకోవాలో చెప్తారు. ఐరన్, క్యాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ అవసరమైతే రికమెండ్ చేస్తారు. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది టెస్ట్​ చేసి అందుకు తగ్గ ట్రీట్​మెంట్​ చేస్తారు. 

 డా. ప్రియాంక రెడ్డి
కన్సల్టెంట్  పీడియాట్రిషన్ 
కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్

ఆ మూడూ ప్రమాదమే!

హెల్త్​ పౌడర్ల తయారీకి విదేశాల నుంచి ముడి పదార్థాన్ని ఫార్ములాగా పంపిస్తారు. దాన్ని ప్రాసెస్ చేసేది స్వదేశాల్లోనే. ఆ టైంలో ఆయా దేశాల్లో కొన్ని కంపెనీలు అదనంగా షుగర్స్ కలుపుతున్నాయి. ప్రస్తుతం చేసిన రీసెర్చ్​లో కొన్ని దేశాలు షుగర్స్ కలపట్లేదు. కానీ ఇండియాలో మాత్రం కంపెనీలు షుగర్స్ కలుపుతున్నాయని తెలిసింది. చక్కెర, ఉప్పు​, మైదా కంటెంట్ ఉన్న ఉత్పత్తులు వాడొద్దు. చక్కెర శరీరంలోకి ఎక్కువగా వెళ్తే బరువు పెరుగుతారు. ఏదైనా సరే ఎక్కువ మొత్తంలో తింటే అది ఏదో ఒక అవయవం మీద ప్రభావం చూపుతుంది. 

ముఖ్యంగా రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడుతుంది. రక్తనాళాలు శరీరంలో ప్రతీ అవయవంతో ఉంటాయి. అవి డ్యామేజ్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే వాటిని దెబ్బ తీయకుండా ఉండేందుకు ఎక్కువ మోతాదులో తినొద్దు అంటారు. 


ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ప్రొడక్ట్స్​లో షుగర్స్ ఎక్కువ ఉంటున్నాయి. షుగర్స్ ఎక్కువ తిన్నా దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కొంచెం పర్లేదు అనుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు, మొబైల్​ ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఒకేచోట గంటల తరబడి కూర్చుంటున్నారు. అటు ఇటు కదలడం లేదు. శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడట్లేదు. జంక్​ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్​ క్రీమ్స్​ లాగిస్తున్నారు. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తిన్నా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరిగితే కిడ్నీ, లివర్, పాంక్రియాస్ వంటి అవయవాల మీద భారం పడుతుంది. 
 

అయితే ఇలా తింటున్న అందరు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పలేం. కానీ ఎఫెక్ట్​ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే తల్లిదండ్రుల్లో ఎక్కువమంది ‘మా పిల్లలు సరిగా తినడంలేదు. ఎదుగుదల సరిగా లేదు. ఏదైనా పౌడర్ రాసివ్వండి’ అని అడుగుతుంటారు. అవి ఇవ్వొచ్చా? లేదా? అందులో ఏమున్నాయి? అనేవి చూసి వాళ్లకి ఆ వయసుకి ఏది మంచిదో అది ఇస్తాం. అవి కూడా కొన్నిరోజులు మాత్రమే వాడాలి. ఫిజికల్ హెల్త్ విషయానికొస్తే ఏజ్​కి తగ్గట్టు ఉంటే సరిపోతుంది. ఎక్కువ లేదా తక్కువ ఉండొద్దు. మెంటల్​ హెల్త్​ విషయానికి వస్తే... తెలివిగలవాడా? చెప్పింది వింటున్నాడా? అనేది చాలా ముఖ్యం. పదేపదే చెప్తున్నారు అనుకున్నా  తల్లిదండ్రులకి చెప్పేది ఒక్కటే... చక్కెర, ఉప్పు, మైదా తినడానికి రుచిని ఇస్తాయి. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు.

డా. శ్రీకాంత్ సందనాల
అసోసియేట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్
నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్

మసాలాల్లో కూడా...

యూరోపియన్​ యూనియన్​ 2019 –2024 మధ్యకాలంలో ఇండియా నుంచి ఎగుమతి అయిన 400కు పైగా ఫుడ్​ ప్రొడక్ట్స్​ను పరీక్షించింది. ఆ పరీక్షల్లో ఏం తేలిందంటే... ఇండియా నుంచి ఎగుమతి అయిన 14 ప్రొడక్ట్స్​లో కాడ్మియం, పురుగుమందులు, ఫంగస్ వంటివాటితో కలుషితమయ్యాయని. వాటిలోని విష రసాయనాలు శరీరావయవాలను దెబ్బతీస్తున్నట్టు గుర్తించారు. ‘‘ఆక్టోపస్, స్క్విడ్​తోపాటు12 ప్రొడక్ట్స్​లో కాడ్మియం ఉందట. అది చాలా విషపూరితం. దానివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరిగింది. 

అంతేకూడా అది క్యాన్సర్​కు కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది” అన్నారు. ఈ రిపోర్ట్​ ప్రకారం బియ్యం, హెర్బ్స్​, సుగంధ ద్రవ్యాలతోపాటు 59 రకాల ప్రొడక్ట్స్​లో క్యాన్సర్​కు కారణమయ్యే పెస్టిసైడ్స్ ఉన్నాయి! మిరపకాయలు, బియ్యం, కాఫీతో పాటు10 ప్రొడక్ట్స్​లో బ్యాన్​ చేసిన మైకోటాక్సిన్​–ఎ, అశ్వగంధ, నువ్వుల గింజలతోపాటు వంద ఇతర ప్రొడక్ట్స్​లో సాల్మొనెల్లా ఉన్నాయి. పంటలు, ఫుడ్​ ప్రొడక్ట్స్​పై రసాయనాలను అతిగా వాడుతున్నారని ఇటీవలే పిటిషన్​ దాఖలైంది. ఈ విషయమై సెంట్రల్​ గవర్నమెంట్​ని వివరణ అడుగుతూ సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది కూడా.

భారత్​ మసాలాలు బ్యాన్!

మనదేశంలో ‘ఎవరెస్ట్​, ఎండీహెచ్’​ బ్రాండ్​ మసాలాలు చాలా ఫేమస్​. కానీ, బ్రిటన్ దేశం వాటిపై నిషేధం విధించింది. ఇంతకుముందు రెండు ప్రొడక్ట్స్​పై హాంకాంగ్​ బ్యాన్ చేసింది కూడా. ఈ రెండు కంపెనీల ద్వారా వచ్చిన మూడు మసాలా మిశ్రమాల అమ్మకాలు ఆపేసింది. వాటిలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్​ ఎక్కువగా ఉందని అమ్మకాలను నిషేధించింది. సింగపూర్​ కూడా ఎవరెస్ట్​ మిక్స్​ను రీకాల్ చేయాలని ఆదేశించింది. వీటితోపాటు న్యూజిలాండ్, యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా ఆ రెండు బ్రాండ్​లకు సంబంధించిన సమస్యలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.  

ప్రపంచంలో మసాలా ఉత్పత్తులు  ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్దది. అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ వెబ్​సైట్ డాటా ప్రకారం, ఇండియా నుంచి 23 మిలియన్ డాలర్ల సుగంధ ద్రవ్యాల ఎగుమతి జరిగింది. ఎండీహెచ్, ఎవరెస్ట్​ తమ ప్రొడక్ట్స్​ను యూఎస్, యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియాతో పాటు అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఈ రెండు ప్రొడక్ట్స్​పై బ్యాన్ విధించడం సంచలనంగా మారింది. 

ఐసీఎంఆర్ గైడ్‌ లైన్స్ ఇవి...

    ప్రతిరోజూ రకరకాల ఫుడ్​తో బ్యాలెన్స్డ్​ డైట్ చేయాలి. న్యూట్రియెంట్స్ ఉండడం తప్పనిసరి.
    గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఆహారం, ఆరోగ్యం ఈ రెండు విషయాల్లో కాస్త ఎక్కువ జాగ్రత్త పడాలి. వీళ్లు పోషకాహారం తినడం అనేది చాలా ముఖ్యం. 
    ఆరు నెలలవరకు తల్లిపాలు తప్పనిసరి. బిడ్డకు రెండేండ్లు వచ్చేవరకు పాలుపడితే ఇంకా మంచిది. కుదిరితే అంతకంటే ఎక్కువ కాలం కూడా ఇవ్వొచ్చు. దానివల్ల పిల్లలకు తగిన పోషకాలు అందుతాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది.
    ఆరునెలల తర్వాత ఇంట్లో తయారుచేసిన సెమీ సాలిడ్​గా ఉండే ఆహారం పిల్లలకు తినిపించొచ్చు. ఇది ఆరోగ్యం, సురక్షితం​. 
    పిల్లలకు, టీనేజర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు అవసరమైన ఫుడ్​ పెట్టాలి. రెండేండ్లు దాటిన వాళ్లకు సమతులాహారం పెట్టాలి. ఎదిగే పిల్లలకు ఇమ్యూనిటీ పెంచే ఆహారం అవసరం.
    కూరగాయలు, పప్పులు, ఆకు కూరలు బాగా తినాలి. 
    నూనెలు తగిన మోతాదులో వాడాలి. ఒకటే వంటనూనె కాకుండా మార్చి మార్చి వాడాలి. 
    ప్రొటీన్స్ కోసం సప్లిమెంట్స్ వాడొద్దు. ఫుడ్ ద్వారా తీసుకోవాలి. మాంసం తింటుండాలి. 
    హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఊబకాయం సమస్య ఉండదు.
    శారీరకంగా ఎప్పుడూ యాక్టివ్​గా ఉండాలి. రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్ చేయాలి.
    ఉప్పు తగినంత వాడాలి. మోతాదు మించితే బీపీ, హార్ట్ ఎటాక్​ సమస్యలు వస్తాయి.
    శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. కలుషితమైనవి తింటే లేనిపోని రోగాలు ‘తిని’ తెచ్చుకున్నట్టే. వాటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం ఇబ్బందిపెడతాయి.
    వంటకు ముందు, వండేటప్పుడు శుభ్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
    నీళ్లు ఎక్కువ తాగాలి. 
    అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్​ చాలావరకు తగ్గించాలి. ఎక్కువ కొవ్వు, షుగర్, ఉప్పు ఉన్న పదార్ధాలు తినొద్దు. 
    వయసు పైబడిన వాళ్లు పోషకాలు ఎక్కువ ఉండే తిండి తినాలి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందాలి. వీటితో పాటు శారీరకంగా చురుకుగా ఉండాలి.
    బాటిల్డ్​, ప్యాకేజ్డ్​ ఫుడ్​ లేబుల్స్ మీద ఉన్న ఇన్​ఫర్మేషన్ చదివి కొనాలి. ఆ ఫుడ్​కు సం బంధించిన వివరాలన్నీ ఆ లేబుల్​ మీద ఉంటాయి. 

‘‘మా బాబు పుట్టినప్పుడు నాకు పాలు పడలేదు. దాంతో డబ్బా పాలు పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నా పాలు వస్తున్నా డబ్బా పాలనే ఇష్టంగా తాగుతున్నాడు. ఇప్పటికి నెల రోజులు అయింది. ఏదో ఒకటి తాగుతున్నాడు చాలనుకున్నా. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి చాలామంది పసివాళ్లకి ఆ పాలు పట్టారు కదా! అందుకే నేను, మా ఇంట్లో వాళ్లు ఆ విషయాన్ని అంత సీరియస్​గా తీసుకోలేదు. కానీ, ఈ మధ్య వార్తల్లో మన దగ్గర దొరుకుతున్న ఆ ప్రొడక్ట్స్​ మంచివి కాదని చెప్తున్నారు. అవి చూశాక ఏం చేయాలో తోచట్లేదు’’ అంది మొదటిసారి తల్లి అయిన సింధు.

‘‘మా పాపకు ఆరేండ్లు. ఇంట్లో ఎంత హెల్దీ ఫుడ్ చేసినా తినదు. బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్, కాంప్లాన్.. వంటి హెల్త్ డ్రింక్స్ పాలలో కలిపి ఇస్తే మారాం చేయకుండా తాగుతుంది. అందుకే ఉదయం, సాయంత్రం అవి ఇస్తున్నా. టీవీలో అడ్వర్టైజ్​మెంట్స్​లో చూపిస్తారు కదా.. అవి తాగితే, శక్తి వస్తుంది. ఎదుగుదలకు మంచిది. పొడవు పెరుగుతారని! కానీ బోర్నవిటాలో చక్కెర శాతం ఎక్కువ ఉందని న్యూస్​ వచ్చింది. దాన్ని వదిలేస్తే మిగతా వాటిలో కూడా అంతే ఉందా? అదెలా తెలుస్తుంది?’’ అంటోంది మాధవి.

‘‘నాకు ఫిట్​నెస్ అంటే ఇష్టం. రోజూ జిమ్​కి వెళ్తా. వర్కవుట్స్​ చేయాలంటే ఎనర్జీ కావాలి. కండలు తిరిగిన దేహం కావాలంటే మంచి ఫుడ్ అవసరం. అందుకే ప్రొటీన్ పౌడర్​తో డ్రింక్స్​ చేసుకుని రెగ్యులర్​గా తాగుతా. నేనే కాదు.. నాలా జిమ్​కి వెళ్లే వాళ్లలో చాలామంది ప్రొటీన్​ షేక్స్ తాగుతారు. కానీ, ప్రొటీన్ పౌడర్స్ వాడితే ప్రమాదం అంటున్నారు. దాంతో డైలమాలో ఉన్నా” అంటున్నాడు రాహుల్. 

ఇలా ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలైంది. ఆరోగ్యాన్ని ఇచ్చేవి అనుకున్న హెల్త్ మిక్స్​ పౌడర్​లు అనారోగ్యకరంగా ఉన్నాయి. అవే కాదు... పసిపిల్లల ఒంటికి వాడే బేబీ పౌడర్​లు కూడా మంచివి కాదని చెప్తున్నారు. మరయితే ఈ సమస్య ఇప్పుడే వచ్చిందా? ఇంతకుముందు కూడా ఉందా? ఇప్పుడెలా బయటపడింది? వీటికి సొల్యూషన్ ఏంటి? అంటూ బోలెడు ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి కదా? అలాంటి ప్రశ్నల్ని కొందరు ఎక్స్​పర్ట్స్​ని అడిగితే చెప్పిన సమాధానాలే ఈ  కవర్​ స్టోరీ. 

మనీష పరిమి