చలి కాలం, పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల మళ్లీ కరోనా కేసుల పీక్: ఎయిమ్స్ డైరెక్టర్

చలి కాలం, పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల మళ్లీ కరోనా కేసుల పీక్: ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో కొద్ది రోజుల నుంచి కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే ఈ ట్రెండ్ మళ్లీ రివర్స్ అయ్యే చాన్స్ లేకపోలేదని మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. చలి కాలం రావడం, గాలిలో కాలుష్యం పెరగడం వంటి కారణాల వల్ల మళ్లీ కరోనా కేసుల పీక్‌కి వెళ్లే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితుల గురించి మాట్లాడారు. ఏటా చలికాలంలో స్వైన్ ఫ్లూ కేసుల భారీ సంఖ్యలో నమోదవుతున్నట్లుగానే కరోనా కేసులు కూడా పెరగొచ్చని ఆయన తెలిపారు. అలాగే గాలి కాలుష్యం పెరిగితే భారీగా కరోనా కేసులు పెరిగే చాన్స్ ఉందని గులేరియా హెచ్చరించారు. ఇటలీ, చైనా దేశాల్లో చేసిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు.

కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

దేశంలో ఇప్పటికే 30 శాతం జనాభాకు యాంటీ బాడీస్ ఉన్నాయని సీరో సర్వేల ద్వారా తేలిందని డాక్టర్ గులేరియా అన్నారు. అంటే దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలంతా తమ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోకుండా ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదని చెప్పారాయన. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం తప్పనిసరి అని, వీటిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ప్లాస్మా థెరపీ వల్ల కూడా అంతగా ప్రయోజనం లేదని ఐసీఎంఆర్ పరిశీలనలో తేలిందన్నారు. యాంటీ బాడీస్ కోసమే ఇతరుల నుంచి ప్లాస్మా ఎక్కిస్తున్నామని, అయితే అప్పటికే కొంతమందికి యాంటీబాడీస్ జనరేట్ అవుతున్నాయని, అయినా మరణిస్తున్నారని గులేరియా చెప్పారు. ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటు తగ్గించవచ్చా అన్న ప్రశ్నకు ఇప్పుడే ఎటువంటి సమాధానం చెప్పలేమన్నారు. దీనిపై మరింత డేటా సేకరించి పరిశీలించాల్సి ఉందని తెలిపారు.