ఆస్పత్రిలో ఉరేసుకున్న కరోనా పేషంట్

ఆస్పత్రిలో ఉరేసుకున్న కరోనా పేషంట్

కరోనా నుంచి కోలుకోలేక కొంతమంది చనిపోతే.. కరోనాకు భయపడి ఆత్మహత్య చేసుకొని మరికొంతమంది చనిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. హవేరిలోని జిల్లా ఆస్పత్రిలో ఒక కరోనా పేషంట్ ఉరేసుకొని చనిపోయాడు. రాణెబెన్నూరులోని లామాని తెగకు చెందిన 70 ఏళ్ల ఒక వ్యక్తి మే 3న కరోనాతో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే 5న హవేరి జిల్లా ఆస్సత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందడంతో ఆ వ్యక్తి కోలుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ, ఆ వ్యక్తి శుక్రవారం రాత్రి వార్డులోని తలుపుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. వార్డులోని మిగతా పేషంట్లు అందరూ పడుకున్నాకా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మొత్తం వార్డులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ.. ‘ఆ వ్యక్తికి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. కానీ, ఫ్రస్ట్రేషన్‌తోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనిపిస్తోంది’ అని తెలిపారు.

గత ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది.  సెహోర్ జిల్లాలోని రెహతి నివాసి అయిన 50 ఏళ్ల వ్యక్తి హమీడియా ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.