
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో 4 లక్షల 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 15,301 మంది మరణించారు. ప్రస్తుతం లక్షా 89 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో భారీ సంఖ్యలోనే అసింప్టమేటిక్ పేషెంట్లు ఉన్నారు.
ఇటీవల పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సోకినా లక్షణాలేవీ కనిపించని ఈ అసింప్టమేటిక్ పేషెంట్లలో ఉన్నట్టుండి సడన్‌గా మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రజలతో పాటు ప్రభుత్వాలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే కరోనా లక్షణాలు పైకి కనిపించనప్పటికీ వైరస్ లోలోపల రక్తంలో ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుని, శరీరంలోని కీలక అవయవాలకు ప్రాణ వాయువు అందకుండా చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా కీలక అవయవాలు పని చేయకుండా ఆగిపోయి ప్రాణం పోతోందని, రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడాన్ని గుర్తించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అసింప్టమేటక్, మైల్డ్ కరోనా పేషెంట్లను ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉంచే చికిత్స అందిస్తున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో వారిని మానిటర్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ఢిల్లీ సర్కారు అద్భుతమైన పరిష్కార మార్గాన్ని గుర్తించింది. అదే పల్స్ ఆక్సీమీటర్. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న పేషెంట్లు తమ శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది. దీని ద్వారా ఆక్సిజన్ లెవల్ 90 నుంచి 85 మధ్యకు చేరితే వెంటనే వైద్యులకు సమాచారం అందిస్తే తక్షణం సాయం అందిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం.
A major issue with Corona is that oxygen level of patient drops sudddenly. Oxygen level should be 95. If it drops below 90 then consider it dangerous, if it drops below 85 then consider it very serious. You will face difficulty in breathing if it drops to 90 or 85: Delhi CM (1/2) pic.twitter.com/X083FMDwdW
— ANI (@ANI) June 26, 2020
ఆక్సీమీటర్.. అసింప్టమేటిక్ పేషెంట్లకు సురక్ష చక్రం: కేజ్రీవాల్
పల్స్ ఆక్సీమీటర్‌ను అసింప్టమేటిక్ కరోనా పేషెంట్ల పాలిట సురక్షా చక్రంగా అభివర్ణించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. హోం ఐసోలేషన్‌లో ఉన్న అసింప్టమేటిక్, మైల్డ్ కరోనా పేషెంట్లందరికీ ఆక్సీమీటర్లను అందించామని తెలిపారు. ఢిల్లీ కరోనా పరిస్థితిపై ఆయన శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. కొంతమంది పేషెంట్లలో ఎటువంటి లక్షణాలు లేకున్నా ఆక్సిజన్ లెవల్స్ మాత్రం సడన్‌గా పడిపోతున్నాయని, దీని వల్ల అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి పేషెంట్‌కు పల్స్ ఆక్సీమీటర్లు అందజేశామన్నారు. ఆక్సిజన్ లెవల్ 95 ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లని, అది 90కి పడిపోతే ప్రమాదకరమని, 85కి చేరితే పేషెంట్ కండిషన్ సీరియస్ అని అర్థమని తెలిపారు కేజ్రీవాల్. 90-85 మధ్యకు ఆక్సిజన్ లెవల్ చేరితే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందన్నారు. ఆ పరిస్థితిని ఎవరైనా ఫేస్ చేస్తే వెంటనే సమాచారం ఇస్తే తాము ఆక్సిజన్ సిలిండర్‌తో అక్కడికి చేరుకుని, ఆ పేషెంట్‌కు వైద్య సాయం అందిస్తామన్నారు.
క్రిటికల్ పేషెంట్లకు ప్లాస్మా థెరపీ
ఢిల్లీలోని ఆస్పత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతున్న క్రిటికల్ పేషెంట్లను కాపాడడంలో ప్లాస్మా థెరపీ మేజర్ రోల్ పోషిస్తోందన్నారు సీఎం కేజ్రీవాల్. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 29 ప్లాస్మా థెరపీ ఇస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మరో 200 మంది పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఆరోగ్యం విషమిస్తున్న వారికి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నామని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి వరకు దాదాపు 74 వేల కరోనా కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని అన్నారు. ఆస్పత్రుల్లో కరోనా బెడ్స్ అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం ఉదయం వరకు 73,780 మందికి కరోనా వైరస్ సోకగా.. 44,765 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే 2429 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 26,586 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు.