
బెంగుళూర్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి మళ్లీ చాప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ కొవిడ్ కోరలు చాస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్నాటకలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మే నెలలో ఇప్పటి వరకు కర్నాటకలో 33 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 9 నెలల శిశువు కూడా ఉంది. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోటేకు చెందిన 9 నెలల శిశువుకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్ సోకిన చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి నిరంతర సంరక్షణ కోసం బెంగళూరులోని వాణి విలాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు.
కర్నాటక హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం.. 2025 జనవరిలో మూడు కేసులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు కేసులు వెలుగు చూశాయి. మే నెలలో మాత్రం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. మే 23వ తేదీ వరకు 33 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటకలో 16 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఇన్ఫ్లుఎంజా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కేసులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పింది.