నాసల్ వ్యాక్సిన్ ఎలా వేస్తారు? ఎన్ని డ్రాప్స్ వేయాలి?

నాసల్ వ్యాక్సిన్ ఎలా వేస్తారు? ఎన్ని డ్రాప్స్ వేయాలి?

దేశంలో తొలిసారిగా ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నెల చివరి వారం నుంచి నాసల్ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం కొవిన్ పోర్టల్ ద్వారా బూస్టర్ డోసు స్లాట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ నాసిల్ వ్యాక్సిన్ ఎలా వేస్తారు? ఎన్ని డ్రాప్స్ వేయాలి? నాసల్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?

నాసల్ వ్యాక్సిన్ ముక్కులో డ్రాప్స్ రూపంలో వేస్తారు. ఒక్క వాయల్ లో రెండు డోసుల వ్యాక్సిన్ ఉంటుంది. ఒక్క డోసులో 8 డ్రాప్స్ ఉంటాయి. ఎడమ ముక్కులో 4, కుడి ముక్కులో 4 డ్రాప్స్ వేస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా తక్కువ మందిలో మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని అంటున్నారు. వాయల్ ను ఓపెన్ చేసిన తరువాత.. 6 గంటల లోపు వాడాల్సి ఉంటుంది. టీకాను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య స్టోర్ చేయాల్సి ఉంటుంది. 

ఇంజక్షన్ రూపంలో వ్యాక్సిన్స్ తీసుకుంటే... వైరస్ బాడీలోకి ఎంటరైన తరువాత ఎటాక్ చేస్తుంది. అదే ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్.. ముక్కులోనే వైరస్ మీద యాంటీబాడీలు దాడి చేస్తాయి. వైరస్ నుంచి బయటపడంతో పాటు టీ సెల్స్ రెస్పాన్స్ కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదిలా ఉండగా నాసల్ వ్యాక్సిన్ బూస్టర్ గా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పరిమితికి మించి తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గుతుందంటున్నారు.

18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ గా ఈ నెల చివరి వారంలో నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నాసల్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఇప్పట్నుంచే కొవిన్ పోర్టల్ ద్వారా బూస్టర్ డోసు స్లాట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో సింగిల్ డోస్ 800గా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ ధర రూ.325గా నిర్ణయించింది.