కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలు విభిన్నం

కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలు విభిన్నం

కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. వివిధ వేరియంట్ల బారిన పడి ఇప్పుడిప్పుడే  సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు మరో కొత్త వేరియంట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  కొవిడ్-19 కొత్త వేరియంట్ ఆర్క్‌చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 

శాస్త్రవేత్తల హెచ్చరిక...

కరోనా యొక్క కొత్త రూపాంతరాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ప్రమాదమని చెప్తున్నారు.  ఆర్క్‌చురస్ (XBB.1.16) భారతదేశంతో పాటు..ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోకి వ్యాపించిందన్నారు. ఇది ఓమిక్రాన్ కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆర్క్ చురస్  స్పైక్ ప్రోటీన్ కారణంగా వేగంగా ప్రజలకు సోకుతుందన్నారు.

తేలికగా తీసుకుంటే అంతే సంగతులు...

కోవిడ్ కొత్త వేరియంట్ ఆర్క్‌చురస్ (XBB.1.16) ఇప్పటివరకు 22 కంటే ఎక్కువ దేశాలలో కనుగొనబడిందని వార్విక్ యూనివర్సిటీ వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్నామని సంబరపడిపోవద్దన్నాడు. ఆర్క్ చురస్ రూపంలో మరో ప్రమాదం ముంచుకోస్తోందన్నాడు.  కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ముందే గ్రహించాలన్నారు. అయితే  దాని సైడ్ ఎఫెక్ట్స్ చూడనంత వరకు దాని సీరియస్ నెస్ అర్థం కాదన్నారు.

WHO దృష్టి...

కొవిడ్-19 కొత్త వేరియంట్‍ ఆర్క్‌చురస్ (XBB.1.16)పై  ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల చిన్నారుల్లో ఈ లక్షణాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది.అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ వేరియంట్ వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని WHO వెల్లడించింది.  ఈ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

ఆర్క్‌చురస్  లక్షణాలు..

ఆర్క్‌చురస్ (XBB.1.16) వేరియంట్ సోకిన వారిలో అధిక జ్వరం, దగ్గు, కళ్లు దురదగా ఉండి ఎర్రబడడం లేదా కండ్లకలక లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియంట్‍లో  కళ్లకు సంబంధించి లక్షణాలు విభిన్నంగా ఉండనున్నాయి.