కరోనా ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య

కరోనా ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య
  • కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పిన్నమనేని సిద్దార్ధ కోవిడ్ హాస్పిటల్ లో ఘటన

కృష్ణా జిల్లా: గన్నవరం మండలంలోని పిన్నమనేని సిద్దార్ధ కరోనా ఆసుపత్రిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరిన రోగి ఏం జరిగిందో కాని ఉదయం డాక్టర్లు, నర్సులు రోగులకు చికిత్స విషయంలో హడావుడిగా రౌండ్లు కొడుతున్న సమయంలో మూడో అంతస్తు పై నుంచి ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేస్తూ కిందకు పడడం కనిపించింది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఆస్పత్రి అత్యవసర చికిత్స విభాగానికి తరలించేందుకు అక్కడే ఉన్న 108 సిబ్బంది ప్రయత్నించేలోగానే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
చనిపోయిన వ్యక్తి ఉంగటూరు మండలం తేలప్రోలు సమీపంలోని కొత్తూరు గ్రామస్తుడు రోశయ్య (50)గా గుర్తించారు. ఇతనికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బతికే రోశయ్యకు కరోనా సోకడంతో ఈనెల 16వ తేదీన ఈ ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. చికిత్స ప్రారంభించాక వారం రోజులకు ఒకసారి పరీక్షలు చేయగా కరోనా పోలేదని తేలింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోశయ్య మంగళవారం తాను చికిత్ప పొందుతున్న గది కిటికీలో నుంచే కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆత్కూరు ఎస్.ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలసి ఆస్పత్రిని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.