క్రికెటర్లకు ప్రతి 3 రోజులకు ఒకసారి కరోనా టెస్టులు

క్రికెటర్లకు ప్రతి 3 రోజులకు ఒకసారి కరోనా టెస్టులు
  • ఆటగాళ్ల కోసం 100 మంది వైద్యులతో రెండు టీములు రెడీ చేసిన బీసీసీఐ

దుబాయ్: వాయిదాపడిన ఐపీఎల్ మ్యాచులు తిరిగి ప్రారంభంకానున్న తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.  క్రికెటర్లకు ప్రతి 3 రోజులకు ఒకసారి కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. క్రికెట్ మ్యాచులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ క్రికెటర్ల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవడంపై దృష్టి సారించింది. దుబాయ్ కేంద్రంగా ఈనెల 19 నుంచి ఐపీఎల్ లీగ్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 
ఐపీఎల్ టోర్నీపై అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రికెటర్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టి సౌదీలోని ఓ ఆరోగ్య సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్రికెటర్లకు ప్రతి 3 రోజులకు ఒకసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాదు అత్యవసర వైద్య నిపుణులు, ఎయిర్ అంబులెన్స్ లతోపాటు ఇతర సహాయ సిబ్బందిని కూడా క్రికెటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. 
క్రికెటర్లు బయో బబుల్ నుంచి బయటకి రాకుండా చూసేందుకు పర్యవేక్షణ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లలోనే వ్యక్తిగత సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. దాదాపు 100 మంది వైద్య సిబ్బందితో రెండు టీములను ఒమన్, దుబాయ్ దేశాల్లో అందుబాటులో ఉంచారు. క్రికెటర్లు దుబాయ్ కు చేరుకునేలోగానే వారు బస చేసే హోటళ్లలోని సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు పూర్తి చేయనున్నారు.