రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం క్లారిటీ

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం క్లారిటీ
  • కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక 
  • తప్పుడు లెక్కలని పిటిషనర్ల న్యాయవాదుల అభ్యంతరం
  • మాస్కులు ధరించడం లేదు.. సోషల్ డిస్టెన్స్ కనిపించడం లేదన్న హైకోర్టు
  • కేసు విచారణ ఈనెల 28కి వాయిదా

హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున హైకోర్టుకు నివేదిక సమర్పించింది.  రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరం  ఉంటుందన్నారు. 
గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం నమోదు కాలేదన్నారు. మెదక్ లో అత్యధికంగా పాజిటివిటీ రేటు 6.45, కొత్తగూడెం జిల్లాలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ నమోదైందన్నారు. అలాగే జీహెచ్ ఎంసీ పరిధిలో 4.26 శాతం, మేడ్చల్ పరిధిలో 4.22 శాతం పాజిటివిటీ నమోదైందని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతం ఉందన్నారు. 
ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగిచినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని వివరించారు. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని.. అలాగే 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు ఇచ్చామన్నారు. 
వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన నివేదికలపై పిటిషనర్ల తరపు న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని వాదించారు. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఐసొలేషన్ కిట్ లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని ఏజీ ప్రసాద్ అన్నారు. మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు కామెంట్ చేసింది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.