హసన్ పర్తి, వెలుగు : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించొద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు.
మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో సీపీ మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.
గోవులను రక్షించాలనే క్రమంలో గో రక్షణ కమిటీ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత తదితరులు పాల్గొన్నారు.
