కాలేజీలు మత్తుకు కేంద్రాలుగా మారుతున్నయ్ : సిటీ సీపీ ఆనంద్

కాలేజీలు మత్తుకు కేంద్రాలుగా మారుతున్నయ్ : సిటీ సీపీ ఆనంద్

సికింద్రాబాద్, వెలుగు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పోయి.. డ్రగ్స్ వచ్చి చేరిందని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీటీ సీపీ ఆనంద్ పిలుపునిచ్చారు.- విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్​కమిటీల ఏర్పాటుపై- ఉస్మానియా వర్సిటీలోని టాగూర్ ​ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. సీపీ సీవీ ఆనంద్ ​చీఫ్ ​గెస్టుగా హాజరై మాట్లాడారు. స్టూడెంట్లకు తోటివారే డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పరిస్థితిని అదుపుచేయకపోతే డ్రగ్స్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాలేజీల్లో గతంలో ర్యాగింగ్​ను అరికట్టినట్లే ఇప్పుడు డ్రగ్స్​పనిపట్టాలన్నారు. డ్రగ్స్ తీసుకునే అమ్మాయిల శాతం పెరిగిందని .. తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్స్​కమిటీలను ఏర్పాటు చేయాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  సిటీలోని 55 కాలేజీల్లో యాంటీ డ్రగ్స్​ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై వేధింపులను అరికట్టేందుకు తొందరలోనే ప్రత్యేక చట్టం రాబోతుందని సీపీ వెల్లడించారు. ఇటీవల డీఏవీ స్కూళ్లో జరిగిన ఘటన తర్వాత ఈ చట్టంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్​కాలేజీ ప్రిన్సిపల్ ​శ్రీరాం వెంకటేశ్, అడిషనల్​ సీపీ విక్రమ్ సింగ్​మాన్,  డీసీపీలు సునీల్ దత్, జి.చక్రవర్తి, వివిధ కాలేజీలకు చెందిన  దాదాపు వెయ్యి మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. 

గాంధీలో మెడికోలకు అవగాహన 

పద్మారావునగర్ :  గాంధీ మెడికల్​ కాలేజీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్​కమిటీలు, చిలకలగూడ పోలీసుల ఆధ్వర్యంలో మెడికోలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ కిశోర్​మాట్లాడుతూ.. డ్రగ్స్​గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వైస్​ ప్రిన్సిపల్ ​డాక్టర్ ​కృష్ణమోహన్, ఆయా డిపార్ట్​మెంట్ల​ ప్రొఫెసర్లు, మెడికోలు పాల్గొన్నారు.