తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కాంలో10 మంది అరెస్ట్

తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కాంలో10 మంది అరెస్ట్

తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కాం కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ నిధులు యూనియన్ బ్యాంక్ ద్వారా దారి మళ్లినట్లు సెప్టెంబర్ 27న ఫిర్యాదు వచ్చిందని సీపీ తెలిపారు. ఈ స్కాంలో మూడు కేసులకు సంబంధించి FIRలు నమోదు చేసి విచారించామన్నారు. దాదాపు రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ అంజనీకుమార్ వివరించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలవారీగా నిధులను డ్రా చేశారన్నారు. ఈ కేసులో ప్రమేమం ఉన్నవారిలో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. మరో 9 మంది అనుమానితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.

ఈ అక్రమాలకు పాల్పడిన తెలుగు అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ తో  పాటు చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. కాగా ఈ కేసులో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందన్నారు. 2015 ఏపీ హౌసింగ్ బోర్డ్ స్కాంలో సాయికుమార్‌ను సీఐడీ విచారించిందన్నారు. రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

తాజాగా కెనరా బ్యాంక్‌ చందానగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సాధనను అరెస్ట్ చేశామని తెలిపారు జాయింట్ CCS పోలీసులు. అటు.. యూనియన్ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్ వలీని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు బాగా తెలిసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. యూనియన్‌ బ్యాంక్ మేనేజర్‌ మస్తాన్‌వలీతో ఏజెంట్లు నండూరి వెంకట్, సాయి, వెంకట్‌ కుమ్మక్కయ్యారు. కమీషన్లు ఇస్తామంటూ అకాడమీ సిబ్బందిని ఈ కుంభకోణంలోకి దింపారు. నిందితుల నుండి 12 లక్షలు వరకు సీజ్ చేశారు.