
కూకట్ పల్లి, వెలుగు: సైబరాబాద్పరిధిలోని పోలీసు స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని సీపీ అవినాశ్మహంతి ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు ఎఫ్ఐఆర్ కాపీల కోసం స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. సున్నితమైన కేసుల్లో సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి అందజేస్తామన్నారు.
ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ గురువారం బాలానగర్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు తన సిబ్బందితో కలిసి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వృద్ధుల ఫిర్యాదులపై నమోదు చేసిన కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను వారి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఇప్పటి వరకు వృద్ధులు,శారీరకంగా వైకల్యం ఉన్న వారు తమ ఫిర్యాదులపై నమోదైన కేసుల సమాచారం కోసం ఎఫ్ఐఆర్ కాపీలను పొందేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇది శారీరకంగా కూడా కష్టమైన పని కావడంతో వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ అవినాశ్ మహంతి ఆలోచించారు.
ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు. వారి చిరునామాకు పోలీస్ సిబ్బంది స్వయంగా వెళ్లి FIR కాపీ అందజేస్తారు.
ఇంకా సీపీ ఆదేశాల మేరకు, ఒకవేళ కేసు సున్నితమైనదైతే (sensitive in nature), అదనపు ప్రైవసీ కోసం పోలీసులు సివిల్ డ్రెస్‌లో వెళ్లి FIR కాపీని అందజేస్తారు.
సామాజికంగా బలహీన వర్గాలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర పోలీస్ కమిషనరేట్లకు కూడా ఆదర్శంగా నిలవనుంది.