మహిళలను కించపరిస్తే సహించం : సీపీ సజ్జనార్

మహిళలను కించపరిస్తే సహించం :  సీపీ సజ్జనార్
  • ఆధారాలు లేకుండా వార్తలు రాస్తరా?: సీపీ సజ్జనార్
  •     తప్పు చేయకుంటే భయమెందుకు? 
  •     విచారణకు వస్తానని చెప్పి.. సెల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నరు
  •     దొంతు రమేశ్ బ్యాంకాక్ పారిపోతుంటేనే పట్టుకున్నం
  •     ఎన్టీవీ సీఈవో విచారణకు ఎందుకు రావట్లేదు? 
  •     ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై నిందలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అసత్య కథనాలతో అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం ఆందోళనకరమన్నారు. బుధవారం నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పోలీస్​ స్టాల్‌ను​ ప్రారంభించిన తర్వాత మీడియాతో సజ్జనార్​ మాట్లాడారు. 

చట్ట ప్రకారమే ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశామని సజ్జనార్​ తెలిపారు. ‘‘మీడియా ప్రతినిధులు తప్పు చేయనప్పుడు విచారణకు పిలిస్తే ఎందుకు రావడం లేదు. ఎన్టీవీ ఇన్‌‌పుట్​ఎడిటర్ ​దొంతు రమేశ్ అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోతుంటే అదుపులోకి తీసుకున్నాం. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని చెప్పి సెల్​ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. 

విచారణకు సహకరించనందునే వాళ్లను అరెస్టు చేశాం. ఎన్టీవీ సీఈవో కూడా విచారణకు రావాలి” అని పేర్కొన్నారు. తాము ఎవరి ఇంటి డోర్లు పగులగొట్టలేదని, ఒకవేళ డోర్లు పగులగొట్టినట్టు ఆధారాలుంటే చూపాలన్నారు. మహిళా ఐఏఎస్ అసభ్య కథనాల కేసుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోల మార్ఫింగ్ కేసును కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. 

మహిళలపై దుష్ప్రచారం నేరం.. 

మహిళలపై దుష్ప్రచారం చేయడం నేరమని సీపీ సజ్జనార్​అన్నారు. ‘‘ప్రజా జీవితంలో విమర్శలు సహజమే. కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, అసభ్య వ్యాఖ్యలు చేయడం క్రూరత్వం. టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్తా కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం. మహిళలు వివిధ రంగాలకు నాయకత్వం వహిస్తున్నారు. పాలనలో, పోలీసు శాఖలో, శాస్త్ర రంగంలో, మీడియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై దాడులు అంటే దేశ ప్రగతిపైన దాడులు చేయడమే. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది. మహిళలను అవమానించడం, వారిపై వివక్ష చూపడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం” అని హెచ్చరించారు.

ఓవర్ యాక్షన్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు.. 

సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు. సోషల్ మీడియాలో వ్యక్తగత విమర్శలు, కించపరిచే విధంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగతంగా, ఫ్యామిలీల గురించి తప్పుడు వార్తలు రాయవద్దు. ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేయొద్దు. చట్టానికి లోబడి నాలుగు గోడల మధ్య ఎలాంటి విమర్శలు చేసుకున్న మాకు సంబంధం లేదు. కానీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం.  - శివధర్ రెడ్డి, డీజీపీ