
- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ అవసరం: ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, వెలుగు: ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బనకచర్లపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని మగ్దుంభవన్‌లో సీపీఐ నేతలు సయ్యద్ అజీజ్ పాషా, పశ్యపద్మతో కలిసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని.. వీటిని పక్కనపెట్టి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీతో నీరు ఎల్లంపల్లికి చేరేదని వివరించారు. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వాడుకోవాలన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై ఏసీబీ చేస్తున్న దాడుల్లో కోట్లు బయటపడుతున్నాయని చెప్పారు. విచారణ సంస్థలు అవినీతిపై నిగ్గుతేల్చి దోషులను శిక్షించాలని కూనంనేని కోరారు. కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో శ్వేత ప్రతం విడుదల చేయాలని పశ్యపద్మ డిమాండ్ చేశారు.