
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చర్చకు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మొట్టమొదటగా మద్దతు తెలిపిన జాతీయ పార్టీ సీపీఐ అని, గురుదాసుగుప్తా, ఏబీ బర్దన్, సురవరం సుధాకర్‌రెడ్డి తమ పార్టీ వాణి వినిపించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో నారాయణ, చాడ వెంకటరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన ప్రతి పోరాటంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వర్గీకరణ అనేది మాల, మాదిగల మధ్య సంఘర్షణ కాదని, బాగా వెనుకబడిన మాదిగల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే అని చెప్పారు. వర్గీకరణ ఉద్యమం 1987లో అరుందతి సేవా సమితి ఆధ్వర్యంలో మంద జగన్నాథం ప్రారంభించారని.. ఆ తర్వాత 1990లో మంద కృష్ణ మాదిగ ఆ ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తు చేశారు.