
- విద్య, వైద్యం అందించడంలో కేంద్రం విఫలం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
సిద్దిపేట టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం కోట్లాది మందిని ఊహల్లో విహరింపజేస్తోందని, విద్య, వైద్యం, సమానత్వ పాలన అందించడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేటలో ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని మోదీ చెబుతున్న మాటలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
దేశంలో 10 శాతం మంది చేతుల్లోనే సంపద ఉందన్నారు. కమ్యూనిస్టులు, మావోయిస్టులను అణచివేయడంలో చూపే శ్రద్ధ ప్రజా సమస్యలపై పెట్టాలని చెప్పారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దురదృష్టకరమని, దీనిపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే టైంలో కేసీఆర్, హరీశ్‌రావులు హంగూఆర్భాటం ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్‌తో పాటు అన్నీ తానే చేశానని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు తనకేమీ తెలియదనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కాళేశ్వరం పూర్తిగా పనికిరానిదని, దీని వల్ల సంవత్సరానికి రూ. 22 నుంచి రూ. 23 వేల కోట్ల భారం పడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజల అవసరాలను తీర్చే దిశగా పాలన సాగించాలని సూచించారు. సీపీఐ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు లక్ష్మణ్, శంకర్, బన్సీలాల్, ఆరిఫ్, సత్యనారాయణ, మల్లేశం, చంద్రం, ప్రసన్నకుమార్, సుధాకర్ పాల్గొన్నారు.