భూపోరాట యోధుడు ఇక లేడు!

భూపోరాట యోధుడు ఇక లేడు!

పెద్దపల్లి, వెలుగు: నిజాం వ్యతిరేక పోరాటం నుంచి  తెలంగాణ ఉద్యమం వరకు పోరాడిన సీపీఐ నేత బుర్ర కొండయ్యగౌడ్(86)​  మంగళవారం కన్ను మూశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన బుర్ర కొండయ్యగౌడ్​ జీవితాంతం పేదల పక్షాన పోరాటం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఎర్రజెండా అంటే గుర్తుకు వచ్చేది బుర్ర కొండయ్య పేరే.  చిన్నతనం నుంచే  సీపీఐ కార్యకర్తగా ఉన్న కొండయ్య రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్​ దాకా వివిధ హోదాల్లో పనిచేశారు.   నాటి ఇందుర్తి ఎమ్మెల్యే  దేశిని చిన మల్లయ్య, సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్​రావు, చాడ వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీగా సేవలందించిన ధర్మభిక్షం సహచరుడిగా కొండయ్య గౌడ్ ప్రజా పోరాటాల్లో పాలుపంచుకున్నారు. 

ఎలిగేడు లో దేశాయ్ భూములను ఎస్సీలకు పంచడంలో అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ భూ పోరాటం జరిగినా కొండయ్య ముందుండేవారు.  గీత కార్మికుల సంక్షేమం కోసం గౌడ జన హక్కుల పోరాట సమితిని స్థాపించి,  వారి సంక్షేమం కోసం పాటుపడ్డారు. కొండయ్య​కు భార్య లక్ష్మి, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఎలిగేడులో మంగళవారం మధ్యాహ్నం కొండయ్య అంత్యక్రియలు జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ సంతోష్​కుమార్​ హాజరై, నివాళులర్పించారు.