కాంగ్రెస్ థర్డ్​ లిస్టు ఇచ్చేదాక వేచిచూద్దాం: సీపీఐ

కాంగ్రెస్ థర్డ్​ లిస్టు ఇచ్చేదాక వేచిచూద్దాం: సీపీఐ
  • సీపీఐ రాష్ట్ర కమిటీ మీటింగ్​లో నేతల నిర్ణయం  

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, సీపీఐ పొత్తుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కొత్తగూడెం, మునుగోడు సీట్లు ఇవ్వాలని సీపీఐ కోరితే.. కొత్తగూడెంతో పాటు చెన్నూరు ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ మూడో లిస్టు వచ్చేదాకా వేచి చూడాలని సీపీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం మగ్దుంభవన్​లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సమక్షంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చించారు. అలాగే, మీడియాలో వస్తున్న కథనాలు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. కోమటిరెడ్డి కామెంట్లు లెఫ్ట్ పార్టీలను కించపరిచేలా ఉన్నాయన్న చర్చ జరిగినట్టు సమాచారం. 

సీపీఐకి, కాంగ్రెస్ కేంద్ర కమిటీకి మధ్య చర్చల కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారని, ఆయన మాటలనే పరిగణనలోకి తీసుకోవాలని వాదనలు జరిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్ పూర్తయిన తర్వాతే  మూడో జాబితా రిలీజ్ చేస్తారని, అప్పటి దాకా వేచిచూద్దామని మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కాంగ్రెస్​లిస్టు తర్వాతే సీపీఎంతో కలిసి పోటీచేసే అంశంపైనా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల అంశం ప్రాసెస్‌‌లో ఉందని, కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూస్తామని తెలిపారు. ఆ తర్వాత తమ నిర్ణయం ఉంటుందన్నారు. 

 కాంగ్రెస్.. పొత్తు ధర్మం పాటించకపోయినా తాము పాటిస్తామని అన్నారు. గురువారం మరోసారి సీపీఐ ముఖ్యనేతల సమావేశం ఉంటుందన్నారు.  సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.