- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: ప్రజల భవిష్యత్తు సోషలిస్టు వ్యవస్థలోనే ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్ష, పేద, ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. జనసేవా దళ్ రాష్ట్ర సమితి సమావేశానికి కూనంనేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోషలిస్ట్ వ్యవస్థ స్థాపించడానికి ఆ దిశగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత శ్రీశ్రీని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
యుక్త వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ ఉరి కంబం ఎక్కారని, ఆయన స్ఫూర్తితోనే యువజన, విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయన్నారు. సీపీఐ100 ఏండ్ల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు15వేల మంది యువ కమ్యూనిస్టులతో భారీ జనసేవాదళ్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్తుందని, పేదలకు న్యాయం జరగాలంటే, ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల్లోకి రావాలని అదే నిజమైన సోషలిజమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేవా దళ్ రాష్ట్ర సమితి కన్వీనర్ పంజాల రమేశ్, సీపీఐ రాష్ట్ర కాఈఈర్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
