- సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సుమారు 12 వేల మంది ఉంటారని, వారి పదవీ విరమణ బకాయిలు ఇప్పటి వరకు అందలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ ఉద్యోగులు మార్చి 2024లో పదవీ విరమణ చేశారని.. ఇప్పటికీ 18 నెలలు గడిచినా బకాయిలు విడుదల కాలేదని తెలిపారు.
ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక భారం పెరిగి మానసికంగా కుంగిపోయి రాష్ట్రంలో కొందరు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం చొరవ తీసుకుని పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.
