ఈడీ విచారణకు వెళ్లకుండా దొండకాయలు కోస్తవా?: నారాయణ

ఈడీ విచారణకు వెళ్లకుండా దొండకాయలు కోస్తవా?: నారాయణ
  •     కవితకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్న

దేవరకొండ, వెలుగు :  లిక్కర్  స్కామ్  కేసులో నిందితురాలిగా ఉన్న సీఎం కేసీఆర్  కూతురు, ఎమ్మెల్సీ కవిత బిజీగా ఉన్నానంటే విచారణకు ఎందుకు పిలవరని ఈడీ అధికారులను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. ఈడీ విచారణకు వెళ్లకుండా దొండకాయలు, బెండకాయలు కోస్తవా అని కవితను ఆయన నిలదీశారు. ఈ వ్యవహారం చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య బంధం బలంగా ఉన్నట్లు అర్థమవుతున్నదని పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా పడమటిపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూప ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్ వాడీలు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా వారితో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. అంగన్ వాడీలపై కక్షసాధింపుకు పాల్పడడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిదన్నారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం గురించి బీజేపీ వక్రీకరించడం హాస్యాస్పదమన్నారు. కొన్ని మతాలకే ఆ పోరాటాన్ని పరిమితం చేయడం సరికాదన్నారు. రావి నారాయణ రెడ్డి, దొడ్డి కొమరయ్య , చాకలి ఐలమ్మ, మొయినుద్దీన్, ఆరుట్ల కమలాదేవి వంటి ఎందరో ప్రముఖులు ఈ పోరాటంలో పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. 

అంగన్​వాడీలకు సంఘీభావం

దేవరకొండలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అంగన్​వాడీల ఆరో రోజు సమ్మెకు నారాయణ సంఘీభావం తెలిపారు. అంగన్ వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్  చేశారు. సీపీఐ జాతీయ కౌన్సిల్  సభ్యుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూగత 48 ఏళ్లుగా ఐసీడీఎస్ లో గౌరవ వేతనం పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ మహిళలను పాలకులు శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి యాదగిరి రావు తదితరులు సమ్మెలో పాల్గొన్నారు.