భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలి:మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా

భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలి:మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా
  • మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ 

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలోని వందల కోట్ల విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. పేదల భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ సర్వోదయ మండలి 3వ రాష్ట్ర మహాసభ సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్ అధ్యక్షత వహించారు. అజీజ్ పాషాతోపాటు అఖిల భారత సర్వ సేవ సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ షేక్ హుస్సేన్, దక్షిణ భారత సమన్వయకర్త మోటూరి కృష్ణ ప్రసాద్, మండలి రాష్ట్ర నేతలు గిరి ప్రసాద్, మునీరుద్దీన్, షేక్ మహమూద్, యాదమ్మ పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా  అజీజ్ పాషా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూదాన్​భూములను గుంజుకుని, ప్రైవేట్ పరిశ్రమలకు కేటాయించిందని మండిపడ్డారు. కాంగ్రెస్​ప్రభుత్వం భూదాన్​యజ్ఞ బోర్డును పునరుద్ధరించి, ఆక్రమణకు గురైన భూదాన్​భూములను స్వాధీనం చేసుకోవాలని, పేదలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మోటూరి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ భూదాన్ భూమి కుంభకోణానికి భూదాన్​యజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కారణమని, ప్రైవేట్ వ్యక్తులకు హోల్ సేల్ గా అమ్మేశాడని ఆరోపించారు.  ఆర్.శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​భూదాన్​భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్​కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఆర్.శంకర్ నాయక్ ను తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.