ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుబెట్టాల్సిందే : సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుబెట్టాల్సిందే : సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ
  • పాక్‌‌‌‌‌‌పై దాడుల విషయంలో నా వ్యాఖ్యలు వక్రీకరించారు: నారాయణ 

హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదం ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దానిని సమూలంగా నిర్మూలించాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్‌‌‌‌కు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌‌‌‌లో నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

అనంతరం నారాయణ మాట్లాడుతూ.. టెర్రరిస్టుల క్యాంపులపై దాడి చేసే క్రమంలో పాకిస్తాన్‌‌‌‌లోని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించ వద్దని మాత్రమే తాను మాట్లాడానని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని, ఇది సరైంది కాదన్నారు. దౌత్యపరంగా ప్రపంచ దేశాలతో భారత్‌‌‌‌ మరింత మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఇంటర్నేషన్‌‌‌‌ టెర్రరిస్టు మసూద్‌‌‌‌ను ఇండియా రప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాకిస్తాన్‌‌‌‌కు చైనా మద్దతు ఇస్తుందనేది అపోహ మాత్రమేనని, ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహిళలను పూజించే దేశంలో వారి అంగాంగ ప్రదర్శనతో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలతో ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలకుంటుందని నిలదీశారు. మహిళలను అడ్డంపెట్టుకుని వ్యాపారం చేస్తారా అంటూ మండిపడ్డారు.

కదనరంగంలో దూసుకుపోతున్న కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని, టర్కీ తప్ప ప్రపంచ దేశాలన్నీ భారత్‌‌‌‌కు మద్దతుగా నిలిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను సీపీఐ స్వాగతిస్తుందని చెప్పారు.