
- బీఆర్ఎస్లీడర్లు తలకాయ లేకుండా మాట్లాడుతున్నరు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అంటారా ..? అని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పారు. ఆయన అహంభావం, అవినీతి వల్లే.. ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మాట్లాడుతూ ‘ కేసీఆర్ ఎందుకు పోటీ చేశారు.. ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదు? ప్రజా సంపాదనను పందికొక్కులా తింటూ శాసనసభకు పోవడం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ బీజేపీ తెలివిగా వ్యవహరిస్తోంది. కేసు అప్పగిస్తే మేనేజ్ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన బాధ్యుడు. జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీశ్ రావు అనడం సిగ్గు చేటు. బీఆర్ఎస్లీడర్లు తలకాయ లేకుండా మాట్లాడుతున్నరు. రెండు నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట’ అని నారాయణ అన్నారు.