వామపక్షాల్లో ఐక్యత లోపించింది: సీపీఐ నారాయణ

వామపక్షాల్లో ఐక్యత లోపించింది: సీపీఐ నారాయణ

హైదరాబాద్: వామపక్షాల్లో ఐక్యత లోపించిందని, బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ ఆయన వీ6 న్యూస్ తో మాట్లాడుతూ.. సీపీఎం వైఖరిపై ఆరోపణలు వస్తున్నాయని, ఎల్లుండి వరకు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ తో కలిసి వస్తుందని భావిస్తున్నానని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారానికి 20 రోజుల సమయం ఉందని, సీపీఐ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర, పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా కోఆర్డినేషన్ కమిటీలు వేసుకున్నామని చెప్పారు.

సంపూర్ణమైన సహకారంతో ప్రచారం నిర్వహించనున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు సహకరించేందుకే సీపీఎం క్యాండిడేట్లను పెట్టారా..? అన్న ప్రశ్నకు అలాంటి ఆరోపణలు వస్తున్నాయని, అయితే ఎల్లుండిలోగా కాంగ్రెస్ తో పొత్తు ఖరారయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు వచ్చిందని, ధన రాజకీయం వచ్చిన తర్వాత ఉన్నంతలోనే కమ్యూనిస్టు పార్టీలు ఫైట్ చేస్తున్నామని చెప్పారు.  వైభవం లేక పోవచ్చు.. కానీ పోరాటాలు ఆపడం లేదన్నారు. హైదరాబాద్, వరంగల్ పరిసరాల్లో ఎన్నో భూ పోరాటాలు చేశామని చెప్పారు.

తమకు ఓటేయకుంటే ప్రజలే నష్టపోతారని కేసీఆర్ అంటున్నారని, ప్రజలు గెలిపించకపోయినా.. మూడు, నాలుగు తరాలు బతుకుతామనే ధీమాలో ఉన్న కేసీఆర్ కన్వీన్స్ అయినట్టున్నారని చెప్పారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు.. పోయారు కానీ.. ప్రజలకు ఎలాంటి  నష్టం జరగలేదని అన్నారు. కేసీఆర్ గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటోందని అన్నారు. బీజేపీ పేదలకు వ్యతిరేకమైన పార్టీ అని దానిని ఎవరూ నమ్మబోరని నారాయణ అన్నారు.