
హుజూర్‌నగర్ బైపోల్‌పై సీపీఐ
ఎవరికి మద్దతిచ్చేది
మూడు రోజుల్లో నిర్ణయం: చాడ
హైదరాబాద్, వెలుగు: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలనే నిర్ణయాన్ని సీపీఐ వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉందని చాడ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం పది రోజులుగా సమ్మె చేస్తున్నా.. వారిపై ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు.
చర్చలు జరపకుండా 48 వేల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా వారిని రెచ్చగొట్టిందని మండిపడ్డారు. కొత్తగా రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించి నిరుద్యోగులను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చి ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొందరు మానసిక వ్యధతో చనిపోతున్నారని అన్నారు.
సమ్మెకు పరిష్కారం చూపడానికి బదులు ప్రభుత్వం విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి మాట్లాడాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని చాడ డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్‌లో మంగళవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై వారితో చర్చిస్తామని చాడ చెప్పారు. మద్దతుపై మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.