ఎర్రజెండాలన్నీ ఎర్రకోటపై ఎగరాలి..కమ్యూనిజం, ఎర్రజెండాలే ప్రజలకు రక్షణ కవచం: కూనంనేని సాంబశివ రావు

ఎర్రజెండాలన్నీ ఎర్రకోటపై ఎగరాలి..కమ్యూనిజం, ఎర్రజెండాలే ప్రజలకు రక్షణ కవచం: కూనంనేని సాంబశివ రావు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎర్ర జెండాలన్నీ ఏకమై ఒకే జెండాగా మారాలని, ఆ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న చట్టాలు, హక్కులు ఉండేవే కాదన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తిరోగమన దిశగా వెళ్తున్నదని దుయ్యబట్టారు. ‘సీపీఐ వందేండ్ల ఆవిర్భావ దినోత్సవ సభ’శుక్రవారం హైదరాబాద్‌‌లోని మగ్ధూంభవన్‌‌లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా కూనంనేని సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. దోపిడీ వర్గాల నుంచి మానవ జాతి విముక్తి కోసం అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐకే ఉందన్నారు.  కమ్యూనిజం, ఎర్రజెండా లేకపోతే ప్రజలకు రక్షణ కవచం లేదన్నారు. వచ్చే నెల 18న ఖమ్మంలో సీపీఐ వందేండ్ల ఉత్సవాల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.