ఎన్ కౌంటర్లు అప్రజాస్వామికం .. కేంద్రం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలి : కూనంనేని సాంబశివరావు

ఎన్ కౌంటర్లు అప్రజాస్వామికం .. కేంద్రం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలి : కూనంనేని సాంబశివరావు
  • ఆపరేషన్ కగార్’​ను నిలిపివేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఎన్​కౌంటర్లు అప్రజాస్వామికమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని  సాంబశివరావు అన్నారు.  చత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తోసహా మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందడంపై స్పందించారు.  బుధవారం  సాంబశివరావు  మీడియా ప్రకటన విడుదల చేశారు. శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్ కౌంటర్లు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. 

సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు, రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తున్నదని చెప్పారు. తక్షణమే ‘ఆపరేషన్ కగార్’’​ను నిలిపివేయాలని డిమాండ్​ చేశారు. 

నరమేధానికి స్వస్తిపలకాలి: జాన్ వెస్లీ

అమాయక ప్రజలపై సాగిస్తున్న నరమేధానికి కేంద్రం స్వస్తిపలకాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.  ఓవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదామని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా.. లేఖలు రాసినా..  కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  మూర్ఖంగా మావోయిస్టులను, మావోయిస్టుల పేరుతో గిరిజనులను కాల్చి చంపుతున్నదని అన్నారు. చత్తీస్​గఢ్​ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతున్నదని ఆరోపించారు.  ఇప్పటికైనా మావోయిస్టుల చర్చల ప్రతిపాదన పై సానుకూలంగా స్పందించి, శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.