- సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి
గోదావరిఖని, వెలుగు: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని, ఇందుకు ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మిత్ర పక్షంగా సంపూర్ణ సహకారం అందించిందని, అందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సీపీఐకి బలంగా ఉన్న డివిజన్లు కేటాయించాలని కోరారు.
రామగుండం బల్దియాలో సీపీఐ అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సహకారం అందించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్, రాష్ట్ర సమితి సభ్యుడు గౌతం గోవర్ధన్, జిల్లా కార్యదర్శి సదానందం, నగర కార్యదర్శి కె.కనకరాజ్, నగర సమితి నాయకులు పాల్గొన్నారు.
