- ‘సామినేని’ హంతకులను
- కాపాడే విధంగా పోలీసుల విచారణ
- నిందితులను వదిలి బాధితులను ఇబ్బంది పెట్టేలా ఎంక్వైరీ
- ఐదు రోజులైనా నిందితులను పట్టుకోవడంలో సీపీ నిర్లక్ష్యం
- ఖమ్మంలో సీపీఐ(ఎం) నిరసన ప్రదర్శనలో పార్టీ రాష్ట్ర నేతలు
ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి ఏపీ రైతు సంఘం మాజీ కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సామినేని రామారావు హత్య జరిగి ఐదురోజులైనా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని సీపీఐ (ఎం) రాష్ట్ర నేతలు ఆరోపించారు. హంతకులను కాపాడే విధంగా విచారణ కొనసాగుతోందని విమర్శించారు. నిందితులను వదిలి బాధితులను ఇబ్బంది పెట్టేలా ఎంక్వైరీ ఉందని మండిపడ్డారు.
రామారావు హత్యకేసు విచారణ తీరుకు నిరసనగా సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ, ఖమ్మం రూరల్ మండల కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన తీశారు. అనంతరం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ అధ్యక్షతన ఏర్పాటైన సభలో నేతలు మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా విచారణ సాగకపోతే పోలీసు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ గూండాలు కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించారు.
భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయిన తర్వాత మధిర నియోజకవర్గంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిందితులు ఆయన వెంటే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ధర్నాలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేశ్, పార్టీ జిల్లా కార్యదర్శి మన్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బండి పద్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
