- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ప్రజల సొమ్మును దోచుకునే హిల్ట్ పాలసీని వెంటనే నిలిపివేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘హిల్ట్ పాలసీ ఎవరి కోసం.. ఎందు కోసం’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జాన్ వెస్లీతోపాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారికి కట్టబెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలి గానీ, ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మి పెట్టడానికి ఆరాటపడతారా అని ప్రశ్నించారు.
అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి హిల్డ్పై ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హిల్ట్పాలసీలో భాగస్వాములైన వారిని వదలబోమని, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు పాపారావు, ఆయాచీతం శ్రీధర్, గోవర్ధన్, గోగుశ్యామల తదితరులు పాల్గొన్నారు.
