
- సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
జడ్చర్ల, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన అవినీతి, ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడాలని, నిజానిజాలేంటో ప్రజలకు చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై కేసీఆర్ మాట్లాడకపోతే ప్రభుత్వ వాదనే కరెక్ట్ అని భావించాల్సి వస్తుందన్నారు. ఏపీలోని పోలవరం తరహాలోనే తెలంగాణలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని, గ్రీన్ చానల్ కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించడంతో పాటు మాజీ సర్పంచ్‌లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే బీసీల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. సీనీ కార్మికుల సమస్యల పట్ల నటుడు చిరంజీవితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించి, కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్‌గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సురేశ్, రాము, అల్వాల్‌రెడ్డి, గోవర్ధన్, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.