అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శంభునికుంటను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం శంభుని కుంట వద్ద మండే మార్కెట్లో సంతకాల సేకరణ చేపట్టారు. వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య ఉన్న శంభుని కుంటను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. కుంటలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి సుందరీకరించాలన్నారు. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
చుట్టూ ఫెన్సింగ్ వేసి కుంటను కబ్జాల నుంచి కాపాడాలన్నారు. సంతకాల సేకరణలో చుట్టు పక్కల కాలనీల వాసులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు, కార్మికులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాండురంగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు నాయిని లలిత, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, జార్జ్, శ్రీనివాస్, సత్తిబాబు, శ్రీనివాస్ రెడ్డి, సుజతా, మల్లేశ్వరి, సురేశ్, హరినాథ్ పాల్గొన్నారు.
