విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి..వామపక్ష పార్టీల నేతల డిమాండ్

విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి..వామపక్ష పార్టీల నేతల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను విరమించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్​ చేశారు.  విద్యుత్ ఉద్యమ అమర వీరుల 23వ వర్ధంతి సందర్భంగా  సోమవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఏడు వామపక్ష  పార్టీల రాష్ట్ర నేతలు గాదగాని రవి, గుర్రం విజయకుమార్, చలపతిరావు, మురహరి, జానకిరాములు, ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. 

అంతకుముందు బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ కింద విద్యుత్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ర్యాలీగా బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్ లో నిర్వహించిన సదస్సుకు చేరుకుని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. విద్యుత్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యుత్ ను నిత్యావసరంగా కాకుండా ఎమర్జెన్సీగా పరిగణించాలని, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు –2022ను ఉపసంహరించుకోవాలని, ప్రీ పెయిడ్ మీటర్లను పెట్టే యోచనను విరమించుకోవాలని,  వ్యవసాయానికి విద్యుత్ సరఫరా   చేయాలని, 100 యూనిట్లలోపు గృహావినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని  డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యుత్ అమర వీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు.