- సీఎం రేవంత్‌కు జాన్‌వెస్లీ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎంకు ఆయన ఈ మేరకు లెటర్ రాశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నది. రాష్ట్రంలో 1,800 ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న 14 లక్షల మంది విద్యార్థులకు రూ.8,042 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.1,924 కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ నిధులు చెల్లించకపోవడంతో విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యాలు, వాటిలో పనిచేస్తున్న 2.5 లక్షల మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో అక్రమాలు ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ బకాయిలను ఆపడం సరికాదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ నిధులను విడుదల చేసి సమస్య పరిష్కరించాలి’ జాన్ వెస్సీ కోరారు.
