- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దారుణం
చింతకాని, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం నాయకుడు సామినేని రామారావు (75) హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నిద్రలేచిన రామారావు ఇంటి పక్కనున్న కోళ్ల గూడును తీస్తున్నాడు. అప్పటికే డాబాపై ఉన్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో రామారావుపై దాడి చేశారు. రామారావు కడుపు, ఛాతిపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రామారావు హత్య విషయం తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఖమ్మం సీపీ సునీల్ దత్, చింతకాని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా, రామారావుది రాజకీయ హత్యనా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల కింద ఓ లవ్ మ్యారేజీ విషయంలో రామారావు పంచాయితీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వారి హస్తం ఏమైనా ఉందా అనే వివరాలు సేకరిస్తున్నారు. రామారావు హత్య విషయం తెలుసుకున్న సీపీఎంరాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు.
ఇది కాంగ్రెస్ పనే : సీపీఎం నాయకులు
రామారావును హత్య చేసింది కాంగ్రెస్ గూండాలేనని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతునేని సుదర్శన్‌రావు ఆరోపించారు. పాతర్లపాడులో స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే హత్య చేశారన్నారు. కాగా, సీపీఎం నాయకుల ఆరోపణలను చింతకాని మండల కాంగ్రెస్ ఖండించింది. హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని, పోతినేని సుదర్శన్ నిజం తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు.
దుండగులను వదిలిపెట్టొద్దు :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సామినేని రామారావు హత్య విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా వెంటాడి, వేటాడిచట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. రామారావు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
