హైదరాబాద్, వెలుగు: సీపీఎం రాష్ట్రనేత సామినేని రామారావును హత్యచేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శనరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాదినేని రమేశ్ మంగళవారం డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడారు. ఖమ్మం జిల్లా చింతకాని మండంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సామినేని రామారావును అదే గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వర్రావు, కండ్రా పిచ్చయ్య , కొత్తపల్లి వెంకటేశ్వర్లుతోపాటు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా నరికి చంపారని ఆరోపించారు.
