అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ఉన్న శంభుని కుంటను కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఎం నేత నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గుర్రపు డెక్క, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి ప్రజలకు ఉపయోగపడేలా కుంటను సుందరీకరించాలని ఆదివారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. సీపీఎం, ప్రజా సంఘాల నాయకులతో కలిసి శనివారం శంభుని కుంటను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుంటను ఆనుకొని బీరంగూడ, జయలక్ష్మీనగర్, సాయి కాలనీలు ఉన్నాయని, కుంటకు ఇరువైపులా ఉన్న రోడ్డు మీదుగా వెళ్లే ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుంటలో కుళ్లిపోయిన పదార్థాలు, చెత్త, ప్లాస్టిక్ వేస్తున్నారని, డ్రైనేజీ నీటితో దోమలు విజృంభిస్తుండడంతో మలేరియా, డెంగ్యూ లాంటి రోగాల బారినపడుతున్నారన్నారు
. కబ్జా నుంచి శంభునికుంటను కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడేలా బాగు చేసే కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాండరంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు లలిత, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, బీవీఆర్కే రాజు, వెంకటేశ్వర్రావు, నరేంద్ర, రమేశ్ పాల్గొన్నారు.
