ధరలను కంట్రోల్​ చేయడంలో మోడీ విఫలం

 ధరలను కంట్రోల్​ చేయడంలో మోడీ విఫలం

హనుమకొండ, వెలుగు: బీజేపీని గద్దె దించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం హనుమకొండ పబ్లిక్​ గార్డెన్​ నుంచి అమృత సెంటర్​ వరకు గుడిసెవాసులు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత అమృత గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడారు. పెరుగుతున్న ధరలను కంట్రోల్​ చేయడంలో మోడీ విఫలమయ్యాడన్నారు. ఉచిత పథకాలు రద్దు చేయాలంటున్న ప్రధాని, కేవలం ఆయన స్నేహితులకు మాత్రం అన్నీ ఉచితంగా ఇస్తున్నాడని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలతో ఇందిరాగాంధీలాంటి నేతలనే ఓడించారని, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అలాగే కూలుస్తామన్నారు.  

ఇండ్లు ఇవ్వకపోతే ఓట్లు పడవని తెలియాలి

పేదలందరికీ ఇండ్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్​మోసం చేశాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పేదలకు ఇండ్లు ఇవ్వకపోతే ఓట్లు పడవనే విషయాన్ని సీఎం కేసీఆర్​కు తెలిసేలా చేస్తే..  ఇండ్లు వాటంతటవే  వస్తాయన్నారు. పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ పేదలకు ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు.. సర్కారు భూముల్లో వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్నాయని మండిపడ్డారు. వరంగల్ లో మంత్రి దయాకర్​రావు కబ్జాకోరులను ప్రోత్సహిస్తూ.. గుడిసె వాసులపై మాత్రం కేసులు పెడుతున్నాడన్నారు. అట్లాంటి వాళ్లు బతికి బట్టకట్టరన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, నాయకులు సుదర్శన్​, బొట్ల చక్రపాణి, వాసుదేవరెడ్డి, వీరన్న, గుడిసె వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.