రాష్ట్రంలో ఇళ్లు ఇవ్వని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, కబ్జా కోరులకు ప్రభుత్వం అండగా ఉంటోదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. అందరికీ ఇళ్లు ఇస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హన్మకొండలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్ నుండి అమృత గార్డెన్ వరకు సీపీఎం నాయకుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం కేంద్ర, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మనేని మాట్లాడారు. ఓట్లు పడవని తెలిసేలా చేస్తే ఇళ్లు అవే వస్తాయన్నారు.
పేదలందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ.. విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నట్లు విమర్శించారు. ప్రపంచంలో ఎర్రజెండా ఉన్న చోటల్లా విద్య, వైద్యం అన్నీ పేదలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. పేదలకు ఎర్రజెండా అండగా ఉంటుందని, పోరాడితేనే ఇళ్లు వస్తాయన్నారు. అలాంటి వారికి అండగా ఉండేందుకే తాము వచ్చినట్లు, పోరాటం ద్వారానే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. నోటు, సారా, బిర్యానీలకు అమ్ముడుపోమని గొంతెత్తి చాటాలి.. ఆ చైతన్యం వస్తే హక్కులు సాధించుకోగలమన్నారు. వరంగల్ నగరంలో అక్రమార్కులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజలు చేసే ఉద్యమాలకు అండగా ఉంటామని, పోలీసుల తూటాకు తమ గుండెలు అడ్డు పెడతామన్నారు.
