ఎన్నికల్లోపే సీపీఎస్ రద్దు చేయాలె

ఎన్నికల్లోపే సీపీఎస్ రద్దు చేయాలె

 

  • ఎన్నికల్లోపే సీపీఎస్ రద్దు చేయాలె
  • సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్​
  • సర్కారు స్పందించకుంటే సెప్టెంబర్​లో మౌనదీక్ష 
  • మహారాష్ట్రలో బీఆర్ఎస్  కోసం చేసే ఖర్చు తెలంగాణలో పాత పింఛన్  కోసం ఖర్చుపెట్టాలి: మహారాష్ట్ర విభాగం ప్రెసిడెంట్
  • ఎగ్జిబిషన్  గ్రౌండ్​లో ‘పాత పింఛన్ సాధన సాకార సభ’ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్  స్కీమ్​(సీపీఎస్​) విధానాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లోపే రద్దు చేయాలని సీపీఎస్​ ఎంప్లాయీస్​ యూనియన్  డిమాండ్  చేసింది. సర్కారు స్పందచకపోతే సెప్టెంబర్​లో రాష్ట్రవ్యాప్తంగా మౌనదీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్​ రద్దు చేస్తే.. కేంద్రం వాటికి సంబంధించిన నిధులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్​పై తమకు నమ్మకం ఉందని, రాష్ట్రంలో ఓపీఎస్​ అమలు చేస్తే తామంతా ఆయన వెంటే ఉంటామని వెల్లడించింది. శనివారం సీపీఎస్​ ఈయూ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ‘పాత పింఛన్ సాధన సాకార సభ’ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రం నుంచి వేల మంది సీపీఎస్  ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీపీఎస్​ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది సీపీఎస్​ ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారని, వారికి సామాజిక భద్రత లేకుండా పోయిందన్నారు. తమ సంఘం సీపీఎస్ రద్దు కోసమే పుట్టిందని, సీపీఎస్  రద్దైతే తమ సంఘాన్నీ రద్దు చేసుకుంటామని ఆయన తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా సీఎం కేసీఆర్  సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్  ఇచ్చారన్నారు. కానీ, సీపీఎస్  ఉద్యోగులందరికీ సర్వీస్ పెన్షన్  కావాలని కోరారు. 

సీపీఎస్  రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఈ స్కీమ్  ద్వారా జమైన నిధులను కేంద్రం వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్​ను ఇప్పటికిప్పుడు రద్దుచేస్తే, ప్రభుత్వంపై ఒక్కపైసా భారం కూడా పడదన్నారు. పైగా రూ.16,500 కోట్ల పింఛన్  నిధి సమకూరుతుందని చెప్పారు. కొత్త పింఛన్  విధానంతో ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత లేకుండా పోతుందని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. 

సీపీఎస్​ను రద్దు చేసి దేశ్ కీ నేతగా మారాలి

నేషనల్  మూమెంట్  ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్  జాతీయ అధ్యక్షుడు విజయ కుమార్ బంధు మాట్లాడుతూ తెలంగాణలోని రెండు లక్షల మందితో పాటు దేశంలోని 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. సీపీఎస్ ను రద్దుచేసి మరోసారి దేశ్​ కీ నేతగా మారాలని కేసీఆర్ కు ఆయన సూచించారు. పాత పింఛన్  ఉద్యోగుల హక్కు అని మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు విటేశ్  ఖండేల్కర్  అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్  కోసం సీఎం కేసీఆర్  చేసే ఖర్చును తెలంగాణలో పాత పింఛన్  అమలు కోసం ఖర్చుపెట్టాలని ఖండేల్కర్  సూచించారు. తమిళనాడు విభాగం నాయకుడు ఆరోగ్యదాస్  మాట్లాడుతూ సీపీఎస్  రద్దుచేస్తే రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశముందన్నారు. 

ఝార్ఖండ్  విభాగం అధ్యక్షుడు విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జార్ఖండ్  సీఎం హేమంత్  సోరెన్ కు కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయని, తమ సీఎంతో తెలంగాణకు ఈ అంశంపై మాట్లాడిస్తామన్నారు. పంజాబ్  రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్ జిత్ సింగ్, కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంతారాం, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, చత్తీస్​గఢ్  నేత రాకేశ్ సింగ్ తదితరులు తమ రాష్ర్టాల అనుభవాలను వివరించారు. 

ఈ కార్యక్రమంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్  శ్రీకాంత్, కోశాధికారి నరేశ్  గౌడ్, రాకేశ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, జ్యుడీషరీ ఎంప్లాయీస్  జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, అగ్రి డాక్టర్స్ నేత తిరుపతి, టీఆర్టీఎఫ్​ రాష్ట్ర  కార్యదర్శి కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్  రెడ్డి, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్  రెడ్డి, సబ్ రిజిస్ట్రార్   అసోసియేషన్  రాష్ట్ర జనరల్  సెక్రటరీ సిరాజ్, తపస్  రాష్ట్ర కార్యదర్శి నవాత్  సురేశ్, టీటీఎఫ్​ నేత లక్ష్మణ్  నాయక్, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.