పొల్యూషన్ వెదజల్లే టపాసులు కాల్చొద్దు

పొల్యూషన్ వెదజల్లే టపాసులు కాల్చొద్దు
  • కెమికల్స్​తో తయారయ్యే టపాసులపై అన్నిచోట్లా బ్యాన్
  • గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే పర్మిషన్లు.. 2 గంటలే కాల్చుకోవాలని కండిషన్లు

న్యూఢిల్లీ: దీపావళి, గురుపూరబ్, క్రిస్మస్ పండుగలు, న్యూఇయర్ వేడుకల సీజన్ షురూ కావడంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు టపాసుల మోతలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీస్కుంటున్నయి. ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించేందుకు సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ను అమలు చేసే దిశగా గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే అనుమతిస్తున్నాయి. కరోనా కాలంలో ఎయిర్ పొల్యూషన్​తో ప్రజల ఆరోగ్యానికి మరింత హాని కలిగే ప్రమాదం ఉండటంతో కొన్ని రాష్ట్రాలు టపాసులను కంప్లీట్​గా బ్యాన్ చేయగా.. మరికొన్ని రాష్ట్రాలు టపాసుల పొల్యూషన్​ను కంట్రోల్ చేసే దిశగా గైడ్ లైన్స్ జారీ చేస్తున్నాయి. పంజాబ్​లో దీపావళి, గురుపూరబ్ పండుగల సందర్భంగా గ్రీన్ క్రాకర్స్(పొల్యూషన్ తక్కువగా వచ్చే కెమికల్స్​తో తయారైన టపాసులు)ను 2 గంటలు మాత్రమే కాల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ లో గ్రీన్ క్రాకర్స్​నే అనుమతిస్తున్నట్లు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదివరకే టపాసులపై ఆంక్షలు, బ్యాన్ ను ప్రకటించారు.

ఢిల్లీలో కంప్లీట్ బ్యాన్

ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ) సెప్టెంబర్ 29నే ప్రకటించింది. ఢిల్లీలో టపాసులపై కంప్లీట్ బ్యాన్ జనవరి 1 దాకా ఉంటుందని వెల్లడించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు క్రాకర్స్ పై బ్యాన్ అత్యవసరమని అంతకుముందు సీఎం కేజ్రీవాల్ చెప్పారు. టపాసులు కాల్చుకోవడాన్ని అనుమతిస్తే జనమంతా గుంపులుగా పోగయి వేడుకలు జరుపుకొంటారని, దీంతో కరోనా మళ్లీ తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుందని డీపీసీసీ పేర్కొంది. క్రాకర్స్ తో భారీగా ఎయిర్ పొల్యూషన్ జరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కూడా ఏర్పడుతుందని వివరించింది. అందుకే ప్రస్తుత విపత్తు కాలంలో టపాసులు కాల్చడం ఏమంత మంచిది కాదని అభిప్రాయపడింది.

పంజాబ్ లో 2 గంటలే

పంజాబ్​లో దీపావళి, గురుపూరబ్​ పండుగల సందర్భంగా రాత్రి 8 నుంచి 10 మధ్య 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా రాత్రి 11:55 నుంచి 12:30 మధ్య 35 నిమిషాలు మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

బెంగాల్​లో గ్రీన్ క్రాకర్స్ కు ఓకే

పశ్చిమ బెంగాల్​లో గ్రీన్ క్రాకర్స్ మినహా అన్ని రకాల టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే పండుగల సీజన్​లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది. అయితే దీపావళి రాత్రి 2 నుంచి 10 మధ్య, ఛత్ పూజ పొద్దున 6 నుంచి 8 మధ్య 2 గంటల పాటు, క్రిస్మస్, న్యూఇయర్ రోజున రాత్రి 11:55 నుంచి అర్దగంట పాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని మమత సర్కారు స్పష్టం చేసింది.