
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కేంద్రంగా ఉన్న కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీఎస్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. పాల్వంచలోని కేటీపీఎస్ లో 2106 మంది, వైటీపీఎస్ లో 396 మంది, బీటీపీ ఎస్ లో 501 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కేటీపీఎస్ లో రెండు పోలింగ్ స్టేషన్లలో, వైటీపీఎస్, బీటీపీఎస్లలో ఒక్కో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ బాక్స్ లను పాల్వంచలోని డీఏవీ పాఠశాలకు తీసుకువచ్చి ఓట్లు లెక్కించనున్నారు. అదేరోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీల అధికారులు గట్టు గంగాధర్, అవధానుల శ్రీనివాస్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి రూ120 కోట్ల లావాదేవీలు నడిచే ఈ సొసైటీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా 13 పోస్టులకు గాను 37 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
గత కమిటీలో ఉన్న అభ్యర్థులతో పాటు తాజాగా 33 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అత్యధికంగా జనరల్ కేటగిరీలో 7 డైరెక్టర్ పోస్టులకు గాను 20 మంది పోటీ చేస్తుండగా, రెండు స్థానాలు ఉన్న బీసీ డైరెక్టర్ పదవి కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క స్థానం ఉన్న ఎస్సీ డైరెక్టర్ పదవి కోసం నలుగురు , ఒక స్థానం గల ఎస్టీ డైరెక్టర్ పదవి కోసం ముగ్గురు, ఒక్కో డై రెక్టర్ స్థానం గల ఎస్ సీ, ఓపీఉమెన్ పోస్టులకు ముగ్గురేసి చొప్పున పోటీపడుతున్నారు.
అయితే ఈసారి అభ్యర్థులు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు. ఇది కాకుండా కేటీపీఎస్ లోని ఏ సెంటర్ కు వెళ్లినా భారీగా అభ్యర్థుల ఫ్లెక్సీ లు దర్శనమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు రూ.15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సభ్యులతో అభ్యర్థులు బేరసారాలకు దిగారు. ఒక్కో ఓటుకు రూ.1000 చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనరల్ కేటగిరీలో ఒకే ఒక ఓటు వేస్తే రూ.5వేలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. జనరల్ ఎన్నికల స్థాయిలో జరుగుతున్న ఈ ఎన్ని కల్లో అభ్యర్థులు అన్ని లక్షలు ఖర్చుపెట్టడం వెనుక మతలబు ఏంటనే ప్రచారం జోరందుకుంది.