IPL 2025: ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు 8 మంది సౌతాఫ్రికా క్రికెటర్లు దూరం.. కన్ఫర్మ్ చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్

IPL 2025: ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు 8 మంది సౌతాఫ్రికా క్రికెటర్లు దూరం.. కన్ఫర్మ్ చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్

ఐపీఎల్ 2025 టోర్నీలో సౌతాఫ్రికా క్రికెటర్లు ఒక వారం మాత్రమే ఉండనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కారణంగా  సౌతాఫ్రికా క్రికెటర్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరం కానున్నట్టు స్పష్టం చేసింది. క్రికెట్ దక్షిణాఫ్రికా తమ ఆటగాళ్లందరూ మే 25 నాటికి స్వదేశానికి తిరిగి వస్తారని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధం కావడానికి తమ ప్లేయర్లకు రెస్ట్ కావాలని సఫారీ బోర్డు భావిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లతో పాటు ఇప్పుడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్లు దూరం కానుండడం ఆయా జట్లకు బ్యాడ్ న్యూస్.

ఐపీఎల్ లో తమ ఆటగాళ్లను పొడిగించుకునేందుకు అనుమతించాలనే ప్రతిపాదనతో బీసీసీఐ అధికారులు క్రికెట్ దక్షిణాఫ్రికాను సంప్రదించారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అభ్యర్థనను తిరస్కరించారు. ఐపీఎల్, బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం మే 25 వరకు మాత్రమే సఫారీ క్రికెటర్లు భారత్ లో ఉండి మే 26 న స్వదేశానికి తిరిగి వెళ్తారని సౌతాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రీ కాన్రాడ్ అన్నారు. 

కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), మార్కో జాన్సెన్ (పంజాబ్ కింగ్స్), ఐడెన్ మార్క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్), ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్), వియాన్ ముల్డర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), లుంగి న్గిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకున్నారు. ఈ కీలక ప్లేయర్లను ఫ్రాంచైజీలు కోల్పోవడం ఆయా జట్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. టెస్ట్ జట్టులో లేని సఫారీ క్రికెటర్లు (క్లాసన్, మిల్లర్)   ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో ఉంటారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 మధ్య జరగనుంది.  ఈ  మెగా ఫైనల్ కు  సౌతాఫ్రికా స్క్వాడ్ వచ్చేసింది. మంగళవారం (మే 13) 15 మంది ఆటగాళ్ల జట్టును సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వీడియో ద్వారా ప్రకటించాడు. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. 

ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు.. జూన్ 3 న ఫైనల్ జరగనుంది.