
- ఫించ్ భారీ సెంచరీ..
- 87 రన్స్ తేడాతో లంకపై విక్టరీ
- కరుణరత్నె పోరాటం వృథా
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా స్థాయికి తగ్గట్టు ఆడింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 153) సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు అందించగా, తర్వాత పేసర్లు స్టార్క్ (4/55) , కేన్ రిచర్డ్‌సన్ (3/47) బంతితో నిప్పులు చెరగడంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 87 రన్స్ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న ఆసీస్ టేబుల్ టాపర్ స్థానానికి చేరగా, ఐదు మ్యాచ్‌ల్లో రెండో ఓటమితో లంక నాకౌట్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 రన్స్ చేసింది. ఫించ్‌తో పాటు స్టీవ్ స్మిత్(73) సత్తా చాటాడు. లంక బౌలర్లలో ఉదాన(2/57), ధనంజయ డిసిల్వా (2/40) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం స్టార్క్, రిచర్డ్‌సన్ ధాటికి 45.5 ఓవర్లలో లంక 247 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (108 బంతుల్లో 9 ఫోర్లతో 97), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 52) పోరాడినా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేడంతో లంకకు ఓటమి తప్పలేదు. ఫించ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
కరుణరత్నె మెరిసినా..
ఛేజింగ్‌లో ఓపెనర్లు కురుణరత్నె, కుశాల్ పెరీరా అందించిన ఆరంభాన్ని ఉపయోగించుకోవడంలో లంక జట్టు విఫలమైంది. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్ల దెబ్బకు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మరో ఓటమి అనివార్యమైంది. ఓపెనర్లు కరుణరత్నె, పెరీరా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరి స్పీడ్‌కు 12.4 ఓవర్లకే లంక వంద రన్స్ మార్క్ చేరుకుంది. హాఫ్ సెంచరీలు చేసుకున్న వీరిద్దరూ విజయానికి బలమైన పునాది వేశారు. అయితే 16వ ఓవర్‌లో పెరీరాను బౌల్డ్ చేసిన స్టార్క్ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అయితే మాక్స్‌వెల్ వేసిన 13వ ఓవర్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికిపోయిన కరుణరత్నె పోరాటాన్ని కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిరిమన్నె(16) నిరాశపరిచినా కుశాల్ మెండిస్(30)తో కలిసి విలువైన పరుగులు చేశాడు. సెంచరీకి చేరువైన కరుణరత్నెను ఔట్ చేసి రిచర్డ్‌సన్ ఆసీస్‌కు బ్రేక్ అందించాడు. రిచర్డ్‌సన్ వేసిన బాల్‌ను కట్ షాట్ ఆడిన దిముత్ బ్యాక్‌వర్డ్‌పాయింట్‌లో మ్యాక్సీకి క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో ఏంజెలో మాథ్యూస్(9)తో కలిసి మెండిస్ 34.3 ఓవర్లకు లంక స్కోరును 200కు చేర్చారు. కానీ, మాథ్యూస్‌ను కమిన్స్ పెవిలియన్ చేర్చగా, వెంటవెంటనే మూడు వికెట్లు తీసిన స్టార్క్ లంకకు మ్యాచ్‌ను దూరం చేశాడు. 37వ ఓవర్లో సిరివర్దనె(3), తిశార పెరీరా(7)ను ఔట్ చేసిన స్టార్క్ 39వ ఓవర్‌లో కుశాల్ మెండిస్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఉదాన(8), మలింగ(1)ను వరుస ఓవర్లలో రిచర్డ్‌సన్ పెవిలియన్ చేర్చాడు. కాసేపు టెయిలెండర్లు విసిగించగా 46వ ఓవర్లో ప్రదీప్(0)ను ఔట్ చేసిన కమిన్స్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
‘ఫించ్’ కొట్టుడు..
ఫామ్‌ను కొనసాగించిన కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపించాడు. ధనాధన్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(26)తో తొలి వికెట్‌కు 80 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.17 ఓవర్లో వార్నర్‌ను బౌల్డ్ చేసిన ధనుంజయ డిసిల్వా లంకకు బ్రేక్ అందించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఉస్మాన్ ఖవాజా(10) నిరాశపరిచాడు. అయినా ఫించ్ వెనక్కుతగ్గలేదు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండతో మరింత చెలరేగిపోయాడు. సిరివర్దనె వేసి 33వ ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి ఫించ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. ఆ తర్వాత ఈ జోడీ మరింత వేగం పెంచడంతో 36వ ఓవర్లోనే ఆసీస్ స్కోరు 200 మార్కు దాటింది. పెరీరా వేసిన 41వ ఓవర్లో 20 రన్స్ రాబట్టింది. ఆ తర్వాత మలింగ బౌలింగ్‌లో బౌండ్రీ కొట్టి ఫించ్ 150 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి స్మిత్ భారీ సిక్స్ కొట్టాడు. అతని జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే ఫించ్‌ను ఉదాన ఔట్ చేసి మూడో వికెట్‌కు 173 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే మలింగ బౌలింగ్‌లో స్మిత్ కూడా
పెవిలియన్ చేరాడు. షాన్ మార్ష్(3), క్యారీ(4), కమిన్స్(0) నిరాశ పరిచినా.. చివర్లో మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 46) ధనాధన్ బ్యాటింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 334/7 (ఫించ్ 153, ధనుంజయ డిసిల్వా 2/40)
శ్రీలంక : 45.5 ఓవర్లలో 247 ఆలౌట్ (కరుణరత్నె 97, స్టార్క్ 4/55).