Manoj Tiwary: ఇక నో యూ టర్న్‌.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన క్రీడా మంత్రి

Manoj Tiwary: ఇక నో యూ టర్న్‌.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన క్రీడా మంత్రి

భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రక‌టించాడు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకూ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో జరిగిన మ్యాచ్ త‌న‌కు చివ‌రిద‌ని వెల్లడించాడు. గతేడాది ఆగష్టులో రిటైర్మెంట్‌ ప్రకటించి వారం రోజుల తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తివారీ.. ఈసారి మాత్రం అలా వెనకడుగు వేసేది తెలిపాడు. ఈ క్రమంలో త‌న రంజీ కెరీర్, ఈడెన్ గార్డెన్స్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడు సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.

"అందరికీ హాయ్.. నేను చివరిసారి మైదానంలోకి దిగే సమయం వచ్చేసింది ! నాకు ఇష్టమైన 22 గజాల సుదీర్ఘ నడకకు బహుశా ఇదే చివరిసారి. ఇన్నేళ్లూ నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.." అని తివారీ ట్విట్టర్(ఎక్స్)లో రాసుకొచ్చాడు.

2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ.. 2008లో భారత జట్టు తరుపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే.. గాయాలు అతని క్రికెట్ కెరీర్ ను ప్రశ్నార్థకం చేశాయి. అడపాదడపా రాణించినా.. గాయాల కారణంగా కొన్నాళ్ళు జట్టుకు దూరమవ్వడంతో తిరిగి చోటు సంపాదించుకోలేకపోయాడు. కేవ‌లం 12 వ‌న్డేలు, 3 టీ20లు మాత్రమే ఆడాడు. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున చివ‌రిసారి 2015లో జింబాబ్వేపై వన్డే ఆడిన తివారీ.. ఆ మ్యాచ్ లో 10 పరుగులు చేశాడు.

ఇక దేశవాళీ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. తివారీ 141 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 30 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. తివారీ.. ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీల తరుపున ఆడాడు.