
దేశవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు, సినీ క్రీడా ప్రముఖులు గడచిన కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగు నటి మంచు లక్ష్మి ఇవాళ(ఆగస్టు 13న) ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ముందు టాలీవుడ్ హీరోలు రాణా, విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ లను కూడా అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
తాజాగా మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఈడీ అధికారులు దర్యాప్తుకు హాజరుకావాలంటూ రైనాకు నోటీసులు పంపించటం క్రీడా ప్రముఖులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుధవారం ఉదయం సురేష్ రైనా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు విచారణ కోసం హాజరు కావాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. 1xBet అనే బెట్టింగ్ యాప్ కి సంబంధించిన వివచారణ విషయంలో ప్రస్తుతం రైనాకు నోటీసులు అందాయని తెలుస్తోంది.
ALSO READ : సిటిజన్ షిప్కు ఆధార్ తగిన ప్రూఫ్ కాదు: సుప్రీం కోర్టు
మనీలాండరింగ్ చట్టాల కింద రైనాను ప్రశ్నించి ఆయన వాగ్మూలాన్ని రికార్డ్ చేసుకునేందుకు ఈడీ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి రమ్మని కోరినట్లు వెల్లడైంది. 1xBet యాప్ ను రైనా ప్రమోట్ చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో రైనాను ప్రశ్నించటం ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో జరిపిన లావాదేవీలు, ఆ డబ్బును ఎలా వినియోగించారు లేదా లెక్కల్లో చూపినదానికి మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనే వివిధ కోణాల్లో ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం సమాచారం ప్రకారం దేశంలోని దాదాపు 22 కోట్ల మంది ప్రజలు వివిధ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే మెుత్తం 22 కోట్ల మందిలో సగం అంటే 11 కోట్ల మంది రెగ్యులర్ గా ఈ బెట్టింగ్ యాప్స్ వినియోగిస్తున్నారని.. ఎక్కువ మంది తన కష్టార్జితాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ లో కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ముందు మంగళవారం అంటే ఆగస్టు 12న దేశంలోని 15 నగరాల్లో ఈడీ అధికారులు ప్యారీమ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ దర్యాప్తులో సోదాలు చేపట్టారు.