డబుల్ ఇండ్లు అమ్మితే క్రిమినల్ కేసు..అద్దెకు ఇచ్చిన ఇండ్లు రద్దు.!

డబుల్ ఇండ్లు అమ్మితే క్రిమినల్ కేసు..అద్దెకు ఇచ్చిన ఇండ్లు రద్దు.!
  • కొందరు లబ్ధిదారులు ఇండ్లుఅమ్ముతున్నట్టుగా ఫిర్యాదులు
  • త్వరలో మళ్లీ తనిఖీలు చేపట్టనున్న హౌసింగ్ ఆఫీసర్లు
  •  అద్దెకు ఇచ్చిన ఇండ్లను రద్దు చేసే యోచనలో సర్కారు  
  • గ్రేటర్​లో 101 కాలనీల్లో 96 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
  • కొల్లూరు, రాంపల్లిలో నోటరీ ద్వారా అమ్మకాలు
  • ఫ్లోర్​ను బట్టి రూ.20 లక్షలకు విక్రయిస్తున్నట్టు వెల్లడి


హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కొందరు లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్టు హౌసింగ్ అధికారులుకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో ఇంటిని రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్.. ఇలా ఫ్లోర్ ను బట్టి ధరను ఖరారు చేస్తున్నారు. ఈ అమ్మకాలు నోటరీ(స్టాంప్ పేపర్) మీద జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి ఇండ్లు తీసుకొని అమ్మితే పీవోటీ (ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్) యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం101 కాలనీల్లో 96 వేల డబుల్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో పటాన్ చెరు సమీపంలోని కొల్లూరులో అత్యధికంగా16 వేలు, ఈసీఐఎల్ దగ్గరలోని రాంపల్లిలో 6,300, అహ్మద్ గూడలో 4,500, దుండిగల్ లో 4,000, ప్రతాప సింగారంలో 2,000, మహేశ్వరంలో 2,000 ఇండ్లు ఉన్నాయి. మొత్తం 20 ప్రాంతాల్లో వెయి నుంచి15 వేల ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల మంది తమకు సొంత ఇంటి వసతి కల్పించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇండ్లను తీసుకున్నవారిలో కొంతమంది వారంలోని పనిదినాల్లో వేరే చోట ఉంటూ, వారాంతపు రోజుల్లో ఇక్కడకు వచ్చి వెళ్లిపోతున్నారు. భారీ ఎత్తున నిధులు వెచ్చించి, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మించిన ఈ టౌన్ షిప్ లలో ఇలాంటి చర్యలతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

వచ్చే నెలలో ఇళ్ల కేటాయింపులు 

రాష్ర్ట వ్యాప్తంగా ఖాళీగా, అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇళ్లు మొత్తం 59 వేలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని సొంత ఇళ్లు, సొంత జాగా లేని పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అమ్మకాల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. రూల్స్ ప్రకారం పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మడం నిషేధం. అయినా స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇళ్ల అమ్మకాలపై లబ్ధిదారులతో బ్రోకర్లు చర్చలు జరుపుతున్నారు. ఒక్కో ఇంటిని రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బేరం పెడుతూ మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు అమ్మకంలో ఎలాంటి సమస్యలు రాకుండా తాము చూసుకుంటామని చెప్పి లబ్ధిదారులకు మాయమాటలు చెబుతూ ఒప్పిస్తున్నారు. 

పలు శాఖలకు హౌసింగ్ అధికారుల లేఖ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నోటరీ ద్వారా విక్రయిస్తున్న విషయం ఇటీవల పలు కాలనీలను సందర్శించిన అధికారుల దృష్టికి వచ్చింది. దీనిని ప్రారంభంలోనే అరికట్టకపోతే సమస్యలు వస్తాయని విశ్లేషించి కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలైన విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులందరికీ ఇండ్ల లబ్ధిదారుల(యజమానుల) పేర్ల మార్పిడి చేయవద్దంటూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ లేఖలు రాశారు. ఈ ఇండ్లకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ లు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సర్వే

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఇటీవల హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటిని ఎవరికి ఇచ్చారు, ఎవరి పేరు మీద ఉంది, ఎవరు ఉంటున్నారు, లబ్ధిదారుడి కుటుంబ సభ్యులా, రక్తసంబధీకులా.. అద్దెకు ఇచ్చారా.. ఇలా ప్రభుత్వం నుంచి తీసుకున్న లబ్ధిదారుడు ఉంటే వారి సెల్ నంబర్,  ఫోటో వంటివి సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) డెవలప్ చేసిన యాప్ లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందచేశారు. ఇటీవల సర్వే చేసిన సమయంలో పలానా రోజు సర్వేకు వస్తున్నామని, లబ్ధిదారులు ఇళ్లలో ఉండాలని చెప్పి సర్వే చేశారు. ఇపుడు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేసేందుకు హౌసింగ్ శాఖ రెడీ అవుతోంది.  

సిటీకి దూరంగా ఇండ్లు

గత ప్రభుత్వం ముందు చూపులేకుండా సిటీకి దాదాపు 20 కి.మీ. దూరంలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. పేదలు ఉన్న చోట్ల ప్రభుత్వ స్థలాలు లేకపోవటంతో సిటీకి దూరంగా ఇళ్లను నిర్మించారు. అయితే, ఆ ఇండ్లను సిటీలో ఉంటున్న పేద వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు హడావుడిగా పంపిణీ చేసింది. అయితే, పనులు సిటీలో.. ఇండ్లు సిటీ చివర ఉండటంతో ఆ ఇండ్లలోకి వెళ్లడానికి చాలా మంది లబ్ధిదారులు విముఖతతో ఉన్నారు. దీంతో చాలా మంది తమకు ఇచ్చిన ఇండ్లను అద్దెకు ఇచ్చారు. గత ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో ప్రస్తుతం ఎక్కువ శాతం ఇండ్లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. వేల కోట్లు ఖర్చుచేసి గత ప్రభుత్వం సిటీకి దూరంగా నిర్మించిన ఇండ్లను ఇప్పుడు అవి ఇటు లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదు. దీంతో బ్రోకర్లు ఎంటరై, మాయమాటలు చెప్తూ ఇండ్లను అమ్మకాలకు పెడుతున్నారు.

అమ్మితే కేసు.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది 

ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మితే పీవోటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అమ్మినా భవిష్యత్ లో చెల్లవు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఇళ్లు రిజిస్ర్టేషన్ కాకుండా, యజమాని పేరు మారకుండా ఉండేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల శాఖ, విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలికి లేఖలు రాశాం. జీహెచ్ఎంసీలో ఇటీవల డబుల్ ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారన్న వివరాలపై సర్వే పూర్తి చేశాం. అద్దెకు ఇళ్లు ఇచ్చినా రద్దు చేస్తాం. త్వరలో జిల్లాల్లో సైతం సర్వే చేస్తం. రాష్ర్టంలో పేదలు లక్షల మంది ఉన్నారు. వాళ్లు ఇళ్లు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. సిటీకి దూరంగా ఇళ్లు పొందినవాళ్లు ఉండేందుకు స్కూల్, హాస్పిటల్, అంబులెన్స్, రైతు బజార్, బస్సు సౌకర్యం వసతులు కల్పించాం.  
- వీపీ గౌతమ్,హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ